తరువాతి స్టేషన్.. హైటెక్ సిటీ - MicTv.in - Telugu News
mictv telugu

తరువాతి స్టేషన్.. హైటెక్ సిటీ

March 16, 2019

అమీర్‌పేట్-హైటెక్ సిటీ మార్గాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు త్వరలో శుభవార్త తెలుపనుంది హైదరాబాద్ మెట్రో. అత్యంత కీలకమైన అమీర్‌పేట్–హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైల్ నడిపేందుకు మార్గం సుగమమైంది. ఈ మార్గంలో రైళ్లు నడపడానికి కమీషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ కారిడార్‌లో మెట్రో రైళ్లు నడపడానికి గత నవంబర్ నెల నాటికే అన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. నాలుగు నెలలుగా ఈ కారిడార్‌లో ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల కోసం రైళ్లు నడపడానికి సిఎంఆర్ఎస్ అనుమతి తప్పనిసరి కావడంతో మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు ఇంతకాలం వేచి చూశారు. తాజాగా ఆ అనుమతి రావడంతో ఆ మార్గాల్లో ప్రయాణికులకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి, ప్రచార ఆర్బాటం లేకుండా సాదాసీదాగానే ఈ రూట్‌లో మెట్రో రైళ్ల సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు నిర్ణయించారు. దీంతో కొద్ది రోజుల్లోనే హైటెక్ సిటీ మార్గంలో రైలు సేవలను అందుబాటులోకి తేవాలని మెట్రో రైలు అధికారులు తుది ఏర్పాట్లు చేస్తున్నారు.

Ameerpet - hitech city metro trains to run from next week

నిజానికి అమీర్‌పేట-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైళ్ల కోసం ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులతో పాటు, ఇతర కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. నగరంలోని నలుమూలల నుంచి వీరు పనిచేసే ప్రాంతాలకు వస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మార్గంలో రైళ్లు నడపడానికి మార్గం సుగమం కావడంతో వారికి ఎంతో ఊరట లభిస్తుంది. ఈ మార్గంలో అమీర్‌పేట, మధురానగర్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ స్టేషన్లుంటాయి.