రష్యాపై ఒంటరిగా పోరాడుతున్న ఉక్రెయిన్ కి అమెరికా భారీ సాయం ప్రకటించింది. 180 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం అందించనుంది. అందులో ఒక బిలియన్ డాలర్ల మేర ఆయుధాలు, 800 మిలియన్ డాలర్ల నగదు రూపంలో ఇవ్వనుంది. ఆయుధాల్లో పేట్రియాట్ క్షిపణులు, గైడెడ్ బాంబులు ఉన్నాయి. జెలెన్ స్కీ బుధవారం అమెరికాలో పర్యటించగా, అధ్యక్షులు బైడెన్ తో భేటీ అయి అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగిస్తారు.
యుద్ధం మొదలైన తర్వాత జెలెన్ స్కీకి ఇది తొలి అధికారిక విదేశీ పర్యటన కావడం గమనార్హం. అటు పాకిస్తాన్ కూడా ఉక్రెయిన్ కి ఆయుధ సాయం చేయనుందని ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. భారత్ రష్యాతో సన్నిహితంగా ఉన్నందును అమెరికాతో కలిసి ఉక్రెయిన్ కి అండగా నిలుస్తోంది. సముద్రమార్గం గుండా ఆయుధాలు పంపించాలని, ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న యూరోపియన్ యూనియన్ దేశానికి ఈ ఆయుధాలను చేర్చనుందని సమాచారం. మెర్టార్లు, రాకెట్ లాంచర్లు, మందుగుండు సామాగ్రి ఇవ్వనుండగా, దానికి ప్రతిఫలంగా తమ సైన్యంలోని ఎంఐ – 17 హెలికాప్టర్లను అప్ గ్రేడ్ చేసుకోవాలని భావిస్తోందంట. ఉక్రెయిన్ – పాకిస్తాన్ ల మధ్య చాలాకాలంగా మిలిటరీ, వాణిజ్య రంగాల్లో సత్సంబంధాలున్నాయి. 1991 నుంచి 2020 వరకు పాకిస్తాన్ సుమారు 1.6 బిలియన్ డాలర్ల విలువైన మిలటరీ ఉత్పత్తులను ఉక్రెయిన్ నుంచి కొనుగోలు చేసింది. వీటిలో ఉక్రెయిన్ తయారు చేసిన టీ – 80 యూడీ యుద్ధ ట్యాంకులు 320 వరకు ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతలు ఉక్రెయిన్ చూసుకునేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.