America has gives 450 million dollars in security aid to Pakistan
mictv telugu

పాకిస్తాన్‌కు భారీ భద్రతా సాయం.. ఆమోదించిన బైడెన్

September 8, 2022

ఆర్ధిక సంక్షోభం, ఆహార కొరత, భారీ వరదల ధాటికి కకావికలమవుతున్న దాయాది దేశం పాకిస్తాన్‌కు అగ్రరాజ్యం అమెరికా ఆయుధ సాయం చేయడానికి ముందుకు వచ్చింది. 450 మిలియన్ డాలర్ల భారీ భద్రతా సహాయం అందించనుంది. ఇందులో భాగంగా అత్యాధునిక ఎఫ్ – 16 ఫైటర్ జెట్లు ఇవ్వనుంది. నాలుగేళ్లలో మొదటిసారి ఈ తరహా సహాయానికి అధ్యక్షుడు బైడెన్ ఆమోదం తెలిపారు. అంతకు ముందు ఎఫ్ 16 యుద్ధవిమానాలను విదేశీ సైనిక విక్రయానికి ఆమోదిస్తూ యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. తర్వాత ఈ ప్రతిపాదన గురించి కాంగ్రెస్‌కు వెల్లడించగా, ఈ సహాయం వల్ల ఆ ప్రాంతంలో భద్రతా పరంగా ఎలాంటి సమతుల్యం దెబ్బతినదని తెలిపింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పాక్ తమకు ముఖ్య భాగస్వామి అని పేర్కొంది. కాగా, ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి దిగిపోయి షెహబాజ్ షరీఫ్ అధికారంలోకి రావడంతో ఈ కీలక ప్రకటన వెలువడడం గమనార్హం. అటు ఇమ్రాన్ ఖాన తనను పదవీచ్యుతుడిని చేసింది అమెరికానే అని గతంలో ఆరోపించడం తెలిసిందే.