ప్రపంచ బ్యాంక్ కొత్త ప్రెసిడెంటుగా భారత సంతతి వ్యక్తి అజయ్ బంగాను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నామినేట్ చేశారు. ఈ మేరకు గురువారం ప్రకటన చేశారు. ప్రపంచబ్యాంకులో అమెరికాకు అధిక వాటా ఉంది. దీంతో అగ్రరాజ్యం నామినేట్ చేసిన వ్యక్తే దాదాపు అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇప్పటికే పలు టెక్ కంపెనీలకు అధిపతులుగా ఉన్న భారత సంతతి వ్యక్తుల ఖాతాలో మరో కీలక పదవి వచ్చి చేరుతుంది.
ప్రపంచబ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్‌పాస్ ముందస్తుగా పదవికి రాజీనామ చేయనున్నట్టు ఈ నెలలో ప్రకటించారు. జూన్ నుంచి బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టు తెలిపారు. దీంతో కొత్త అధ్యక్షుడి నియామకం అనివార్యమైంది. కాగా, 1959 నవంబర్ 10న పుణెలో పుట్టిన ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో బీఏ ఆనర్స్ డిగ్రీ, అహ్మదాబాద్ ఐఐఎంలో మేనేజ్‌మెంట్‌లో పీజీపీ పట్టా పొందాడు. ఆయన సేవలను గుర్తించిన మన ప్రభుత్వం 2016లో పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. అటు మాస్టర్ కార్డుకు 12 ఏళ్లు సీఈవోగా ఉన్న బంగా 2021 డిసెంబరులో పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌లో వైస్ చైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.