మోదీ, ట్రంప్‌.. మధ్యలో చికెన్ లెగ్ పీస్ రాజకీయం.. - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ, ట్రంప్‌.. మధ్యలో చికెన్ లెగ్ పీస్ రాజకీయం..

February 14, 2020

America india leg piece politics modi trump

అమెరికా కోడికాళ్ల కథ మళ్లీ తెరపైకి వచ్చింది. భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ జరిపే చర్చల్లో ఇది ఒక ప్రధానాంశంగా మారింది. దేశీ పౌల్ట్రీ పరిశ్రమను పణంగా పెట్టి అమెరికా కోడికాళ్లకు తలుపులు బార్లా తెరిచేయడానికి రంగం సిద్ధమైందని వార్తలు గుప్పుమంటున్నాయి.  

ఊరక రారు మహానుభావులు అన్నట్లు.. ట్రంప్ పక్క వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే విచ్చేస్తున్నారు. తమ దేశం నుంచి కోడికాళ్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నారు. కోడి మాంసం ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధిగా ఉన్న భారత్ అమెరికాతో బలమైన దోస్తీ కోసం కాస్త పట్టుసడలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కొన్ని అనివార్య కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. అమెరికా మనదేశానికి ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ)ను గత ఏడాది తొలగించింది. భారత్.. వైద్య పరికరాలు, డేటా, ఈ-కామర్స్‌కు విదేశాలకు చెక్ పెడుతూ ఆంక్షల విధించడమే దీనికా కారణం. జీఎస్పీ హోదా వల్ల కొన్ని ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని, దాన్ని పునరుద్ధరించుకోడానికి ‘పెద్దన్న’ చెప్పినట్లు చేయడమే మంచిదని మనదేశం భావిస్తోంది. 

కాళ్లు ఎందుకు? 

అమెరికన్లలో చాలామంది కోడికాళ్లను తినరు. ఛాతీ(బ్రెస్ట్)నే వాళ్లకు ఇష్టం. దీంతో మెడ, రెక్కలు, కాళ్లు పోగుపడుతుంటాయి. వాటిని పారేయకుండా ఎంతకో కొంతకు విదేశాలకు అమ్మాలని అమెరికా యత్నిస్తుంటుంది. అయితే మన దేశం కోడి కాళ్ల దిగుమతులపై 100 శాతం సుంకాన్ని వసూలు చేస్తోంది. అంత సుంకం కడితే అమెరికాకు మిగిలేదేమీ ఉండదు. అందుకే సుంకాన్ని వీలైనంతగా తగ్గించేలా అమెరికా ఒత్తిడి తెస్తోంది.  25 శాతానికి తగ్గిచేందుకు భారత్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. అది కూడా సరిపోదని సుంకాన్ని 10 శాతానికి తగ్గించాలని అమెరికా కోరుతోంది.