కరోనాతో తెలుగు జర్నలిస్టు మృతి  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాతో తెలుగు జర్నలిస్టు మృతి 

April 7, 2020

America Indian Origin Journalist Corona Attack.

అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీని ప్రతాపానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రధానంగా న్యూయార్క్ నగరంలో అయితే మరణ మృదంగం మోగుతోంది. ఇప్పటికే యూఎస్‌లో 10 వేల మందికి పైగా మరణించగా, ఒక్క న్యూయార్క్‌లోనే 4,758 మంది మరణించారు. తాజాగా నలుగురు భారతీయులు కూడా మరణిచారు. వీరిలో ఓ తెలుగువాడు కూడా ఉన్నారు. బ్రహ్మ కంచిబొట్ల (66) కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

బ్రహ్మ యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాలో బిజినెస్ జర్నలిస్టుగా పని చేస్తున్నాడు. గత 28 ఏళ్లుగా ఆయన ఇదే వృత్తిని కొనసాగిస్తున్నాడు. ఇటీవల కరోనా విజృంభించడంతో గత నెల 23న అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి స్వీయ గృహ నిర్భందంలో ఉన్నాడు. మార్చి 28వ తేదీన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు లాంగ్ ఐస్‌లాండ్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. తొమ్మిది రోజుల పాటు చికిత్స పొంది చివరకు కరోనా కాటుకు బలయ్యాడు. ఇదే సమయంలో అతనికి గుండె పోటు కూడా వచ్చిందని డాక్టర్లు పేర్కొన్నారు. ఆయనకు భార్య అంజనా, కొడుకు సుడామా, కూతురు సుజనా ఉన్నారు. తమ తండ్రిని చివరిసారి చూసేందుకు కూడా వీలులేకపోయిందని సుడామా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 3.50లక్షల మందికి పైగా కరోనా బాధితులు ఉన్నారు. వీరందరిని పరీక్షిస్తూ వైద్య సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు. అయినా కూడా మరణాలు మాత్రం ఆగడంలేదు.