సస్పెండ్ చేశారని స్కూల్లో కాల్పులు.. 17 మంది బలి - MicTv.in - Telugu News
mictv telugu

సస్పెండ్ చేశారని స్కూల్లో కాల్పులు.. 17 మంది బలి

February 15, 2018

అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌ మర్జోరీ స్టోన్‌మన్‌ డగ్లస్‌ పాఠశాలలో బుధవారం అదే స్కూల్లో చదువుకున్న ఓ విద్యార్థి మారణకాండకు పాల్పడ్డాడు. పిచ్చెత్తినట్లు కాల్పులు జరిపి 17 మంది పొట్టనబెట్టుకున్నాడు. మరో 14 మంది తీవ్రంగా గాయపరిచాడు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో విద్యార్థులతోపాటు  ఉపాధ్యాయులూ ఉన్నారు.

నికోలస్‌ క్రూజ్‌ (19) అనే మాజీ విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ’ముఖానికి గ్యాస్ మాస్క్ ధరించి వచ్చి మొదట పొగబాంబులు వేశాడు. తర్వాత ఫైర్ అలారం మోగించాడు. దీంతో ఏం జరిగిందోనని విద్యార్థులు తరగతి గదుల్లోంచి బయటికి రాగా వారిపై  తర్వాత కాల్పులు జరిపాడు’ అని వెల్లడించారు.

మృతదేహాలు, రక్తపు మరకలతో ఆ ప్రాంతం భీతావహంగా కనిపించింది. కాల్పుల నుంచి త‌ప్పించుకుకోవడానికి విద్యార్థులు పరుగులు తీశారు. కాగా కాల్పులు జరిగితే ఎలా తప్పించుకోవాలనే అంశంపై ఈ స్కూల్లో మాక్ డ్రిల్లింగ్ నిర్వహిస్తున్నారని, తాజా కాల్పులు కూడా అందులో భాగమే అనుకుని సిబ్బంది భావించారు. అయితే పిల్లలు తమ కళ్ల ముందే నేలకొరడంతో నిజం కాల్పులని పరుగులు పెట్టారు. నికోలస్ ప్రవర్తన సరిగ్గా లేదని ఇటీవల అతణ్ని సస్పెండ్ చేశారు. ఈ అక్కసుతోనే అతడు దురాగతానికి తెగబడ్డారు. తనను అడ్డకోవడానికి వచ్చిన పోలీసులపైనా కాల్పులు జరిపాడు. తర్వాత విద్యార్థుల్లో కలసి పారిపోవడానికి యత్నించగా పోలీసులు పట్టుకున్నారు.