కరోనా మహమ్మారి గురించి మొట్టమొదటిసారిగా ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన చైనా డాక్టర్ లీ వెన్‌లియాంగ్‌కు అమెరికా అరుదైన గౌరవం కల్పించింది. వాషింగ్టన్ డీసీలోని చైనా ఎంబసీ ముందు ఉన్న ఇంటర్నేషనల్ ప్రాంతానికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించారు. సెనేటర్లు అంతా కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసి దీనికి ఆమోదం తెలిపారు. అయితే అమెరికాలో ఈ ప్రయత్నం చాలా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ సెనెటర్లు ఈ విధమైన తీర్మానం చేయడం విశేషం. 2014లోనూ ఓసారి చైనా నోబెల్ విజేత పేరును ఈ వీధికి పెట్టాలనుకున్నా.. అది సాధ్యం కాలేదు. మరి ఇప్పుడైనా అమలు జరుగుతుందో లేదో చూడాలి.
వుహాన్‌కు చెందిన లీ వెన్‌లియాంగ్ తొలిసారి కరోనా వైరస్ గురించి అనుమానం వ్యక్తం చేశాడు. తన వద్దకు వచ్చిన రోగులను పరీక్షించి ఏదో మహమ్మారి ప్రపంచాన్ని వణికించబోతోందని హెచ్చరించాడు. సహచర డాక్టర్లతో వీచాట్‌లో ఈ విషయాన్ని షేర్ చేశాడు. దీంతో అతన్ని అప్పట్లో చైనా ప్రభుత్వం అరెస్టు చేసింది. కొన్ని రోజులకే లీ వెన్‌లియాంగ్ కరోనా వైరస్ బారీన పడి చికిత్స పొందుతూ.. మరణించాడు. లీ వెన్‌లియాంగ్ మృతితో చైనా వ్యాప్తంగా ప్రజా ఆగ్రహం వెల్లువెత్తింది. అతడు చెప్పినట్టుగానే కరోనా ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఆ తర్వాత అతని కుటుంబాన్ని చైనా ప్రభుత్వం క్షమాపన కోరింది. కాగా అమెరికా సెనేటర్స్ తీసుకున్న నిర్ణయంపై చైనాకు ఆగ్రహంగా ఉంది.