కశ్మీర్‌లో వేలు పెట్టిన అమెరికా.. ప్రతినిధులసభలో తీర్మానం - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీర్‌లో వేలు పెట్టిన అమెరికా.. ప్రతినిధులసభలో తీర్మానం

December 8, 2019

America US house.

కశ్మీర్ ద్వైపాక్షిక వ్యవహారమని, అందులో ఎవరూ జోక్యం చేసుకోలేరని భారత్ స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రావణకాష్టంలా రగులుతున్న ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టి, రాత్రికి రాత్రి ప్రపంచ హీరో అయిపోవాలని  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెగ ఉవ్విళ్లూరుతున్నాడు. భారత్ ససేమిరా అనడంతో వెనక్కి తగ్గుతున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధుల సభ ముందుకు కశ్మీర్‌పై ఒక తీర్మానం వచ్చింది. 

జమ్మూకశ్మీర్‌లో ఆంక్షలను ఎత్తేసి, ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్లను వెంటనే పునరుద్ధరించాలని ఇద్దరు ఎంపీలు తీర్మానం ప్రవేశపెట్టారు. భారత సంతతికి చెందిన డెమోక్రాట్ ఎంపీ, ప్రమీలా జయపాల్, రిపబ్లికన్ ఎంపీ స్టీవ్ వాట్స్సిన్స్ దీన్ని తీసుకొచ్చారు. దీనిపై ఓటింగ్ జరగనుంది. ‘జమ్మూకశ్మీర్లో వెంటనే ఆంక్షలు ఎత్తేయాలి, నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేయాలి. రాజకీయ కార్యకలాపాలు, ప్రసంగాలు చేయకూడదని చెప్పకూడదు. కశ్మీర్‌కు అంతర్జాతీయ హక్కుల సంఘాలను, జర్నలిస్టులను స్వేచ్ఛగా అనుమతించాలి. మైనారిటీలపై సాగే అన్ని రకాల హింసను మేం ఖండిస్తున్నాం.. ’ అని అందులో పేర్కొన్నారు. అదే సమయంలో భారత ప్రభుత్వ అక్కడ ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా గుర్తిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ తీర్మానంపై బీజేపీ, కాంగ్రెస్ కొట్టాడుకుంటున్నాయి. మన ఎంపీలు చెయ్యలేని పనిని అమెరికా ఎంపీలు చేశారని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నాడు. ఆయన అమెరికా భక్తుడని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.