అలీన దేశమైన భారత్ కాలానుగుణంగా విదేశాంగ విధానాన్ని మార్చుకుంటోందని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పేర్కొన్నారు. చైనా దూకుడును తట్టుకోవడానికే భారత్ ‘క్వాడ్’ కూటమిలో చేరాల్సి వచ్చిందని విశ్లేషించారు. దివంగత భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌పై వివాదస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఆమెను భారత రాజకీయాల్లో ప్రముఖ నాయకురాలిగా తానెన్నడూ గుర్తించలేదన్నారు. పాంపియో రాసిన ‘Never Give an Inch: Fighting for the America I Love’ పుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయి. ఆసియా దేశాల విధానాలను కూడా సుదీర్ఘంగా ప్రస్తావించారు. పుస్తకంలోని వివరాల ప్రకారం..
‘‘అమెరికాకు, సోవియట్ రష్యాలకు దూరంగా ఉండాలన్న భారత అలీన వైఖరి చాలా సంవత్సరాలు కొనసాగింది. అయితే ఆసియాలో చైనా ఆధిపత్యం పెరిగిపోవడంతో, పాకిస్తాన్‌తో ఆ దేశ చెలిమి కారణంగా భారత్ తన విదేశాంగ విధానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. చైనా దూకుడును తట్టుకోవడానికి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు భాగస్వాములుగా ఉన్న ‘ఇండో పసిఫిక్ క్వాడ్రిలేటర్ డైలాగ్’ (క్వాడ్) కూటమిలో చేరాల్సి వచ్చింది. 2020లో చైనా సైనికులు ఇరవై మంది భారతీయ సైనికులను చంపేశారు. చైనాతో అనుసరిస్తున్న విధానాన్ని మార్చుకోవాలని భారతీయులు తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చార,’’ అని పాంపియే విశ్లేషించారు. సుష్మా స్వరాజ్ పనితీరును ప్రస్తావిస్తూ ఆమెను భారత రాజకీయాల్లో ప్రముఖురాలని తాను అనుకోలేదన్నారు. ‘‘ఆమెకు రాజకీయంగా ప్రాధాన్యం లేకపోవడంతో మోదీకి సన్నిహితుడైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో వ్యవహారాలు నడిపేవాడిని. ఆమెతో నాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి’’ అని అన్నారు. సుష్మాపై పాంపియో వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా ఖండించారు. కాగా, మైక్ పాంపియో 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.