ట్రంప్ తిక్కకు లెక్కుందో లేదో గానీ..ఆయన అమెరికా అధ్యక్షుడయ్యాక…అక్కడికి వచ్చి, వెళ్లే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. సెక్యూరిటీ పేరుతో చిరాకు తెప్పించే నిర్ణయాలు తీసుకొంటున్నారు. భద్రతా ప్రమాణాల పేరిట తాజాగా ల్యాప్ టాప్ లకు నో అంటోంది. ఎందుకిలా చేస్తున్నారంటే…
అమెరికా వచ్చి, వెళ్లే ఏ విమానాల్లోనూ ల్యాప్‌టాప్‌లను అనుమతించకూడదని భావిస్తుంది. విమానాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికాహోమ్లాండ్ సెక్యూరిటీ మంత్రి జాన్ కెల్లీ చెప్పారు. యూఏఈ, ఖతార్, టర్కీలాంటి ప్రపంచంలోని పది ఎయిర్‌పోర్ట్‌ల నుంచి వచ్చే ప్రయాణికులు.. ఎయిర్‌క్రాఫ్ట్ క్యాబిన్లలో పెద్దపెద్ద ఎలక్ట్రానిక్ డివైస్‌లను తీసుకురాకుండా ఇప్పటికే అమెరికా నిషేధం విధించింది. ఇప్పుడు ప్రతి విమానానికీ ఇదే రూల్ విధించాలన్న ఆలోచనలో ఉంది. అయితే ఎప్పుడు ఈ నిషేధాన్ని అమల్లోకి తెచ్చే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట.
ల్యాప్‌టాప్‌లపై బ్యాన్ విధిస్తే.. కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఎయిర్‌లైన్స్ కంగారుపడుతున్నాయి. ముప్పు ఉందని తెలిసినపుడు ఇలాంటి చర్యలను సమర్థించాల్సిదేనని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ చీఫ్ ఆస్కార్ మునోజ్ అభిప్రాయపడ్డారు. ఇక వెంట తీసుకెళ్లే వస్తులను మరింత క్షుణ్నంగా పరీక్షించాలని కూడా అమెరికా భావిస్తుంది. ఇప్పటికే కొన్ని ఎయిర్‌పోర్ట్‌లలో ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ) కొన్ని అనుమానిత వస్తువులను లగేజీ నుంచి వేరు చేసి ప్రత్యేకంగా పరీక్షించే ఏర్పాట్లు చేసింది. అన్ని ఎయిర్పోర్ట్లకూ దీనిని విస్తరించే యోచనలో ఉంది.