ఇటీవల విమానంలో ప్రయాణికులు మద్యం మత్తులో మూత్రవిసర్జన చేసిన ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికురాలిపై శంకర్ మిశ్రా అనే ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మూత్ర విసర్జన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కఠిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే రిపీట్ అయింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో మద్యం తాగిన మత్తులో ఓ ప్రయాణికుడు, మరో ప్రయాణికుడిపై మూత్రవిసర్జన చేశాడు. విమానం ల్యాండ్ అయిన వెంటనే నిందితుడిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన AA292 విమానం శుక్రవారం రాత్రి 9.16 గంటలకు న్యూయార్క్ నుంచి బయలుదేరి.. 14 గంటల 30 నిమిషాల ప్రయాణం అనంతరం ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి శనివారం ఉదయం 10.12 గంటలకు చేరుకుంది.‘‘ఈ విమానం ఎక్కిన అమెరికా యూనివర్సిటీలో చదువుతోన్న విద్యార్థి.. మద్యం మత్తులో నిద్రపోతూ మూత్రవిసర్జన చేశాడు.. అది ఎలాగో లీక్ అయి తోటి ప్రయాణికుడిపై పడటంతో క్యాబిన్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది’’ అని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.
అయితే, తాను చేసిన పనికి ఆ విద్యార్థి క్షమాపణ కోరడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. అయితే, దీనిని తీవ్రంగా పరిగణించిన ఎయిర్‌లైన్స్.. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చింది. నిందితుడు మూత్ర విసర్జన చేసిన విషయం గురించి పైలట్‌కు క్యాబిన్ క్రూ సమాచారం ఇవ్వడంతో.. అతడు ఏటీసీకి ఫిర్యాదు చేశాడు. దీంతో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అతడ్ని సీఐఎస్ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.