అమెరికాలో కరోనా కల్లోలం.భారీ విపత్తుగా ప్రకటించిన ట్రంప్ - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో కరోనా కల్లోలం.భారీ విపత్తుగా ప్రకటించిన ట్రంప్

March 26, 2020

American Huge Disaster With Corona   

అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ వ్యాధి బారిన పడి వందలాది మంది ప్రజలు ఇప్పటికే ప్రాణాలు వదిలారు. చైనా,ఇటలీ తర్వాత ఈ వైరస్ ఎక్కువగా విజృంభించిన దేశం అమెరికా కావడంతో తీవ్ర కలవరం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా 68,472 కేసులు నమోదు కాగా, 1032 మంది మరణించారు. కేవలం ఒక్కరోజులోనే 164 మంది మరణించడంతో అక్కడ ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీని విధించారు. తాజాగా న్యూయార్క్‌, కాలిఫోర్నియా, వాషింగ్టన్‌, లోవా, లూసియానా, ఉత్తర కరోలినా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాలను భారీ విపత్తు ప్రాంతాలుగా ప్రకటించారు. 

ఈ వైరస్ ప్రభావం న్యూయార్క్‌ నగరంపై పంజా విసిరింది. ఈ ఒక్క రాష్ట్రంలోనే ఏకంగా 285మంది చనిపోగా, 30వేల మందికి వ్యాధి సోకింది. దీనికి సమీపంలోనే ఉన్న న్యూజెర్సీలో 62మరణాలు, కాలిఫోర్నియాలో 65మరణాలు సంభవించాయి. ఈ పరిస్థితుల్లో వైరస్‌ను కట్టడి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని ట్రంప్ తెలిపారు.  దీంతో దేశంలో చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. దాదాపు 10కోట్ల మంది ప్రజలు లాక్‌డౌన్‌లో ఉన్నారు. దేశం భారీ విపత్తును ఎదుర్కొంటున్నట్టుగా ప్రకటించడంతో అక్కడి ప్రజల్లో కలవరం మొదలైంది. కాగా నాలుగు రోజుల క్రితం వరకూ ఈ వ్యాధితో కేవలం 300మరణాలు సంభవించగా.. ప్రస్తుతం వెయ్యి దాటడం ఆందోళన కలిగిస్తోంది.