ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుని మరీ దోపిడీ.. - MicTv.in - Telugu News
mictv telugu

ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుని మరీ దోపిడీ..

November 21, 2022


దొంగతనం చేయాలంటే రెండో కంటికి తెలియకుండా, వీలైతే రాత్రిపూట చీకట్లో చేయాలి. కానీ ఇది పాత సిద్ధాంతం. కొంచెం ఎక్స్‌ట్రా జాగ్రత్తలు తీసుకుంటే ఏమాత్రం భయపడకుండా దర్జాగా దొపిడీ దొంగతనాలు చేయొచ్చు. అమెరికాకు చెందిన జేసన్ క్రిస్టమస్ అనే 42 ఏళ్ల పెద్దమనిషి ఈ బాపతే. దోపిడీ చేయడానికి చక్కగా ఉబర్ కారు బుక్ చేసుకుని, డ్రైవర్‌కు కూడా ఏమాత్రం డౌట్ రాకుండా పని కానిచ్చేశాడు. తలరాత కాస్త బాలేక పోలీసులకు దొరకనూ దొరికాడు.

మిషిగన్ రాష్ట్రంలోని సౌత్‌ఫీల్డ్‌లో ఈ నెల 26న జెసన్ క్రిస్ట్‌మస్ తనకు బ్యాంకులో పనుందని కారు బుక్ చేసుకుని వెళ్లాడు. హంటింగ్‌టన్ బ్యాంకు దగ్గరికి వెళ్లాక, ‘‘కాస్త పనుంది. పూర్త చేసుకుని వస్తా, వెయిట్ చెయ్’’ అని డైవర్‌కు చెప్పి బ్యాంకులోకి వెళ్లాడు. తుపాకీ తీసి అక్కడి సిబ్బందిని బెదిరించి డబ్బు తీసుకున్నాడు. తర్వాత కారులో తుర్రుమన్నాడు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదులో రంగంలోకి దిగి పోలీసులు జేసస్ ఇంటికెళ్లి అతణ్ని అరెస్ట్ చేశారు, ఈ దోపిడీ వెనక డ్రైవర్‌ హస్తం ఏమన్నా ఉందేమోనని అతడిని కూడా విచారించారు. అయితే అతడు కేవలం క్యాబ్ సర్వీసు అందించడానికే వెళ్లాడని నిర్ధారించుకుని వదిలేశారు. క్రిస్మస్ సీజన్‌లో జల్సాల కోసమే జేసన్ దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది.