యుద్ధానికి కారకుడైన వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేయాలని అమెరికాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం రష్యన్ సైన్యానికి పిలుపునిచ్చారు. పుతిన్‌ను చంపడం ప్రపంచానికి గొప్ప సేవ చేయడమవుతుందన్నారు. లిండ్సే అమెరికన్ మీడియాతో మాట్లాడుతూ.. పుతిన్‌ను రష్యాలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి చంపకపోతే యుద్ధం ఎలా ముగుస్తుందని ప్రశ్నించారు. అనంతరం ఇదే విషయాన్ని ట్విట్టర్లొ ప్రస్తావించారు. ‘రష్యా సైన్యంలో రోమన్ రాజు జూలియస్ సీజర్‌ను చంపిన బ్రూటస్ లాంటి వారు ఉన్నారా? లేదా, అడాల్ఫ్ హిట్లర్‌ను చంపేందుకు ప్రయత్నించిన జర్మన్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ స్టౌఫెన్బర్గ్ అయినా ఉన్నారా? అని అడిగారు. పుతిన్‌ను చంపేందుకు రష్యన్లే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడిగా ఉండే లిండ్సే 20 ఏళ్ల పాటు కాంగ్రెస్‌కు సేవలందించారు.
ఇంతకు ముందు పుతిన్‌ను చంపిన వారికి మిలియన్ డాలర్లను బహుమతిగా ఇస్తానని ప్రవాస రష్యన్ వ్యాపారి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, ఉక్రెయిన్‌పై యుద్ధం తొమ్మిదో రోజుకు చేరింది. గురువారం రష్యా జపొరిజ్వ న్యూక్లియర్ ప్లాంట్‌పై చేసిన బాంబు దాడి వల్ల చెలరేగిన మంటలను ఆర్పివేసినట్టు ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ శుక్రవారం తెలిపింది. మరోవైపు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని అత్యవసరంగా సమావేశపర్చాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కాసేపట్లో కోరనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. జపొరిజ్య న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా దాడిని ఈ అత్యవసర సమావేశంలో ప్రస్తావిస్తామని తెలిపింది. కాగా, ఒకవేళ అణుకేంద్రం పేలితే గనక యూరప్ ఖండం మొత్తం ఎడారిలా మారుతుందని పాశ్చాత్య మేధావులు విశ్లేషిస్తున్నారు.