దాదాపు రెండేళ్లపాటు ప్రపంచాన్ని గడగడలాడించింది కోవిడ్ మహమ్మారి. ఇప్పుడు దాని ప్రభావం తగ్గినప్పటికీ…కోవిడ్ సోకిన వారిలో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. కోవిడ్ సోకిన రోగులకు ఇన్ఫెక్షన్ తర్వాత 6 నెలల నుంచి ఏడాది వరకు ఛాతీ నొప్పి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయని అధ్యయనం చెబుతోంది. అమెరికాలోని ఇంటర్ మౌంటైన్ హెల్త్ పరిశోధకకులు గుండె సంబంధిత లక్షణాలతో ఉన్న సుమారు 150,000మంది రోగులపై అధ్యయనం చేశారు. కోవిడ్ పాజిటివ్ గా గుర్తించి రోగులు, కోవిడ్ సంక్రమణ తర్వాత 6 నెలల నుంచి ఏడాది వరకు ఛాతీ నొప్పితో బాధపడినట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.
ఇంటర్ మౌంటైన్ హెల్త్ కేర్ లో కార్డియోవాస్కులర్ ఎపిడెమియాలజిస్ట్, లీడ్ రీసెర్చర్ హెడి టి మే మాట్లాడుతూ కోవిడ్ పాజిటివ్ గా గుర్తించిన రోగుల్లో గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి ఫిర్యాధులు ఏవీ లేవన్నారు. కానీ ఛాతీ నొప్పి ఫిర్యాదులు ఎక్కువగా చూశామని తెలిపారు. కోవిడ్ సోకినప్పటి నుంచి చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఇది భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే కోవిడ్ సోకిన చాలా మందిలో అలాంటి లక్షణాలను గుర్తించినట్లు తెలిపారు.
అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ 2023 సైంటిఫిక్ కాన్ఫరెన్స్ లో ఈ అధ్యయన నివేదికను సమర్పించారు.ఈ బృందం అధ్యయనం చేసిన కోవిడ్ 19 రోగుల్లో 6 నెలల నుంచి ఏడాది మధ్య కాలంలో ఛాతీ నొప్పి ఎదుర్కొంటున్నారని తేలింది. కోవిడ్ బారినపడిన వారిలో ఛాతీనొప్పి సమస్యతో పాటు రానున్న కాలంలో కొత్త సమస్యను సృష్టించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. రాబోయే కాలంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అధ్యయనం తెలిపింది. గుండె వ్యవస్థపై ఇన్ఫెక్షన్ యొక్క శాశ్వత ప్రభావం గురించి ఒక నిర్దారణకు రావడం కష్టమని పరిశోధకులు వెల్లడించారు.