Home > Featured > పాపం.. లాటరీలో కోట్లు గెలిచారు.. పత్తా లేకుండా పోయారు

పాపం.. లాటరీలో కోట్లు గెలిచారు.. పత్తా లేకుండా పోయారు

సాధారణంగా లాటరీ కొన్నాక మనలాంటి వాళ్లం ఏం చేస్తాం. మనకే తగిలితే బాగుండునని కోరుకుంటాం. అందుకోసం లాటరీ తీసే తేదీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటాం. ఫలితాలను ప్రకటించగానే.. అదృష్టం తగిలిందా, బహుమతి ఏదైనా వచ్చిందా అని నంబర్లను వెతుక్కుంటాం. ఓ రకంగా చెప్పాలంటే.. ఆదుర్దాతో తిండీ, నిద్రా మానేసి కూడా వేచి ఉండే వారూ ఉంటారు. అయితే మన వద్ద లాటరీ లేదనుకోండి అది వేరే విషయం. కానీ అమెరికాలో ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఏకంగా రూ. 10,716.18 కోట్లు (134 కోట్ల డాలర్లు) గెలుచుకున్న వారు మాత్రం లాటరీ నంబర్ ను చెక్ చేసుకోలేదు. ఒకటీ రెండు రోజులు కాదు.. ఏకంగా నెల రోజులు అవుతున్నా డబ్బు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావటంలేదు. ఇది లాటరీ నిర్వాహకుల మధ్య చర్చనీయాంశమైంది. లాటరీ గెలుచుకున్న నెంబర్ల సిరీస్‌ను ప్రకటించాక కూడా ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో గెలిచిన వారు త్వరగా ముందుకు రావాలంటూ ఆ కంపెనీ ప్రకటన కూడా జారీ చేయాల్సి వచ్చింది. అయినా ఎలాంటి స్పందన లేదు. సాధారణంగా లాటరీ క్లెయిమ్ చేసుకోవడానికి అమెరికాలో రెండు నెలల సమయం ఉంటుంది. ఇలాంటి మెగా లాటరీకి మాత్రం ఆరు నెలల సమయం ఉంటుంది. అయితే విజేతలు భారీ మొత్తం గెలుచుకున్న విషయం తెలిసినా.. కావాలనే ఆలస్యం చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇంత డబ్బు గెలిచామని తెలిస్తే తమకు ప్రైవసీ ఇబ్బంది అని భావిస్తుండవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. కాగా, అమెరికా చరిత్రలో అత్యంత విలువైన లాటరీలో ఇది మూడోది కావడం విశేషం.

Updated : 29 Aug 2022 3:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top