తల్లి చనిపోయినా కరోనా బాధితులకు డాక్టర్ అండ - MicTv.in - Telugu News
mictv telugu

తల్లి చనిపోయినా కరోనా బాధితులకు డాక్టర్ అండ

March 20, 2020

Amid Corona Scare, Mother’s nomore Couldn’t Stop This Odisha Doc From Delivering Duty

కరోనా విలయతాండవంలో బాధితులు ప్రజలే కాదు.. వారికి వైద్యం చేస్తున్న వైద్యులు, నర్సులు కూడా. ఎన్నో జాగ్రత్తలు పడుతూ కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడుతూ వైద్యం చేస్తున్నారు. చైనాలో ఓ వైద్యుడు కరోనా బాధితులకు వైద్యం చేస్తూ మృతిచెందిన విషయం తెలిసిందే. వైద్యలు, నర్సులు వారి సొంత పనులు మానుకుని.. నెలల తరబడి ఇళ్లకు వెళ్లకుండా పూర్తిగా కరోనా బాధితుల సపర్యలకే సరిపోయారు. ఎంతో అకుంఠిత దీక్షతో తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్న ఓ వైద్యుడి తల్లి చనిపోయింది. అయినా తన కర్తవ్యాన్ని మరిచిపోకుండా కరోనాపై పోరు చేయడానికి వెళ్లిపోయాడు. తెల్లకోటు మాటున తన బాధను అదుమి పెట్టుకుని కరోనా బాధితులకు వైద్యం అందించాడు. పోయిన తల్లి ఎలాగూ రాదు.. కానీ కరోనాతో బాధపడుతున్నవారిని తన కారణంగా బలి తీసుకోవద్దని భావించాడు ఆ వైద్యుడు. తను చేయగలిగినంతా చేసిన తర్వాత ఇంటికెళ్లి.. అంతవరకు అదిమి పెట్టుకున్న బాధను వెళ్లగక్కి అశ్రునయనాలతో కన్నతల్లి అంత్యక్రియలు నిర్వహించాడు. 

ఆ డాక్టర్ పేరు అశోక్ దాస్. ఒడిశాలోని సాంబాల్‌పూర్‌లో కొవిడ్-19 విషయంలో నోడల్ ఆఫీసరుగా పనిచేస్తున్నాడు. 80 ఏళ్ల వయసు ఉన్న ఆయన తల్లి మంగళవారం ఉదయం కన్నుమూశారు. తల్లి మరణంతో అశోక్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తల్లి చనిపోయాక ఎవరైనా వృత్తి గిత్తీ అంటారా? కానీ, ఆయన తన వృత్తి ధర్మాన్ని మరిచిపోలేదు. అసలే కరోనా కాలనాగులా విషం చిమ్ముతోంది. ఈ పరిస్థితుల్లో తన అవసరం చాలా మంది బాధితులకు ఉందని భావించాడు. పంటి బిగువున దుఖ్ఖా:న్ని అదిమి పట్టుకుని ఆసుపత్రికి వెళ్లాడు. కరోనాపై అవగాహన పెంచడం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు, సమావేశాలకు హాజరయ్యాడు. అనంతరం ఇంటికి వచ్చి సాయంత్రం కన్నతల్లి అంత్యక్రియలు నిర్వహించాడు. ‘నా తల్లి బతికి ఉన్నప్పుడు ప్రజాసేవే ముఖ్యం అని చెప్పేది. నేను అదే చేశాను’ అని అశోక్ తెలిపాడు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో తెలియడంతో నెటిజన్లు వైద్యుడికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.