కరోనా సమయంలో సీఎంకు షాక్.. 20 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు! - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా సమయంలో సీఎంకు షాక్.. 20 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!

May 29, 2020

Amid Karnataka's Covid-19 Fight, Yediyurappa Faces Another Battle as 20 Miffed MLAs Flex Muscles

తీవ్ర కష్టకాలాన్ని ఎదుర్కుంటున్న కరోనా సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు ఆయన ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ఉత్తర కర్ణాటకకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇలాంటి పరిస్థితి వచ్చి సర్దుకుపోయింది. కానీ, ఇప్పుడు యడియూరప్ప తీవ్రంగా సతమతమవుతున్నట్లు సమాచారం. వారి వెనకాల మాజీ మంత్రి ఉమేశ్ కట్టి ఉన్నారని తెలుస్తోంది. ఉమేశ్ కట్టి బలమైన లింగాయత్‌ వర్గానికి చెందిన నాయకుడు. ఈయన సారథ్యంలో గురువారం రాత్రి ఓ విందు జరిగింది.

ఆయనతో ఏకీభవించే 20 మంది ఎమ్మెల్యేలు ఆ విందులో పాల్గొన్నారు. అయితే వారెవ్వరూ బయట పడనప్పటికీ అంతర్గత విబేధాలతో, వివిధ కారణాలతో ఆ 20 మంది సీఎం యడియూరప్పతో విభేదిస్తున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.  వారందరికీ యడియూరప్ప పనితీరు, వ్యవహార శైలి బొత్తిగా నచ్చడంలేదట. మరోవైపు వారంతా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమేశ్ కట్టిని కేబినెట్‌లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన తమ్ముడు రమేశ్ కట్టిని ఈసారి రాజ్యసభకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో యడియూరప్ప.. వెంటనే కట్టిని చర్చలకు పిలిచి, వివరణ అడిగినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా మరో సీనియర్ ఎమ్మెల్యే, లింగాయత్ వర్గానికి చెందిన బీఆర్ పాటిల్ కూడా యడియూరప్పపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.