ప్రపంచదేశాల్లో కరోనా తీవ్రత పెరుగుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అలర్ట్ జారీ చేసింది. నిన్న కేంద్రమంత్రి నేతృత్వంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ అత్యున్నత సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ గురువారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సహా ఇతర ఉన్నతాధికారులు దీనిలో పాల్గొననున్నారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్ 7 (Omicron BF 7) కేసులు భారత్ లో కూడా వెలుగు చూడటంతో అప్రమత్తత ప్రకటించారు. గుజరాత్ లో రెండు కేసులు, ఒడిశాలో ఒకరికి కొత్త వేరియంట్ సోకినట్లు తేలింది. కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోడానికి ముందస్తు చర్యగా.. గురువారం మధ్యాహ్నం మోదీ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రితో పాటూ, హెల్త్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు, కోవిడ్ ఫస్ట్, సెకెండ్ వేవ్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన అధికారులు పాల్గొననున్నారు. ముఖ్యంగా ప్రికాషన్ డోసు విషయంలో ప్రజల్ని అప్రమత్తం చేయనున్నారు. అర్హులందరికీ ప్రికాషన్ డోసు వేసేలా నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదిలా ఉండగా.. పొరుగు దేశం చైనాతోపాటు ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని సూచించింది. చైనా, జపాన్, అమెరికా సహా పలు దేశాల్లో కోవిడ్ పరిస్థితులపై అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన నిన్న ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించి చర్యలు తీసుకుంటామని నిన్నటి సమావేశంలోనే తెలుపగా.. ఈ నాటి ప్రధాని మోదీ సమీక్ష అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.