అదిచ్చాం ఇదిచ్చాం: అమిత్ షా.. నీ లేఖ అబద్ధాల పుట్ట: బాబు - MicTv.in - Telugu News
mictv telugu

అదిచ్చాం ఇదిచ్చాం: అమిత్ షా.. నీ లేఖ అబద్ధాల పుట్ట: బాబు

March 24, 2018

ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావడంపై బీజేపీ అధినేత అమిత్ షా చాలా ఆలస్యంగా స్పందించారు. చంద్రబాబు నిర్ణయం దురదృష్టకరని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మించినదానికంటే ఎంతో చేశామపొ ఏకరవు పెడుతూ 9 పేజీల లేఖ రాశారు. ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేర్చామని చెప్పుకొచ్చారు. ఇచ్చిన నిధులకు లెక్కలు చూపలేదని ఆరోపించారు. దీనికిపై చంద్రబాబు కూడా ఘాటుగానే స్పందించారు. అమిత్ షా లేఖలో ఉన్నదంతా అబద్ధాల పుట్ట అని మండిపడ్డారు.

అమిత్ షా లేఖలో ఏముంది?

‘టీడీపీ ఏకపక్ష నిర్ణయంతో ఎన్డీఏ నుంచి తప్పుకుంది. బాబు నిర్ణయం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అభివృద్ధి కంటే రాజకీయపరమైన అంశాల కారణంగానే వెళ్లిపోయారు. ఏపీ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందించింది. టీడీపీకి లోక్‌సభలో, రాజ్యసభలో సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు మేమే అజెండా తయారుచేసి ఇచ్చాం. ఏపీకి కేంద్ర విద్యాసంస్థలు, ఎయిమ్స్‌ మంజూరు చేశాం. మూడు ఎయిర్‌పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మార్చాం. అమరావతిలో రైల్‌రోడ్‌ నిర్మాణానికి, 180 కి.మీ రింగ్‌రోడ్డుకు నిధులు ఇస్తున్నాం. మెట్రో రైలు ప్రాజెక్టుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపాం. ఏపీ కోసం కేంద్ర స్థాయిలో ఎంత చేయాలో అంతా చేసింది. 2016-17లో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇచ్చిన నిధుల్లో కేవలం 12 శాతానికే లెక్కలు చూపారు. అమరావతికి రూ. 1000 కోట్లు విడుదల చేస్తే, కేవలం 8 శాతానికే లెక్కలు పంపారు…’

చంద్రబాబు ఫైర్

అమిత్ షా లేఖపై చంద్రబాబు అసెంబ్లీలో ఘాటుగా స్పందించారు. ‘అమిత్‌ షా లేఖలో అన్నీ అసత్యాలు, వక్రీకరణలే ఉన్నాయి. ఆయనకు ఎవరో  తప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఈశాన్న రాష్ట్రాలకు అన్నీ మంజూరు చేస్తున్నారు? మాకు మాత్రం ఉత్తచేయి చూపుతున్నారు? ఏపీకి ఒక రూలు? మిగతా వారికి మరో రాలా? విభజన చట్టం హామీలు అమలు చేసుంటే ఏపీకి ఎన్నో పెట్టుబడులు వచ్చేవి. మమ్మల్ని అసమర్థులుగా చూస్తున్నారు.  హోదాతో సమానంగా ఇస్తామన్న ప్యాకేజీ ఏమైంది? మేం కొత్తవి అడగడం లేదు. విభజన చట్టంలో ఉన్నవే డిమాండ్ చేస్తున్నాం…’ అని స్పష్టం చేశారు.