లాక్‌డౌన్ పొడిగింపుపై రేపే కీలక నిర్ణయం  - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్ పొడిగింపుపై రేపే కీలక నిర్ణయం 

May 29, 2020

 

Lockdown 5.0.

మూడుసార్లు పొడిగించిన లాక్‌డౌన్‌ ఆదివారంతో ముగియనుంది. దేశవ్యాప్తంగా వైరస్ కేసులు పెరుగుతుండటంతో మరోసారి లాక్‌డౌన్‌ పొడిగిస్తారా లేదా.. ప్రత్యేక సడలింపులు ఏమైనా ఉన్నాయా అనేది రేపు తేలనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హోం మంత్రి అమిత్ షాతో పాటు సీనియర్ నేతలు కలిసి సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై ఓ నిర్ణయానికి వచ్చి కరోనావైరస్ లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయాన్ని శనివారం ప్రకటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్థితిగతులపై సమాచారం సేకరించిన హోంశాఖ విశ్లేషణలు జరిపింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించేశాయి. అమిత్ షాతో గోవా ముఖ్యమంత్రి జరిపిన సంభాషణల్లో లాక్‌డౌన్ మరో 15 రోజుల పాటు పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి లాక్‌డౌన్ పొడిగిస్తే ఏ సర్వీసులు తెరుచుకుంటాయి.. ఏవి మూతపడతాయో చూద్దాం.

అత్యవసరం కాని వస్తువుల అమ్మకాలకు అనుమతులు ఇవ్వనున్నారు. లాక్‌డౌన్ 5.0లో ఎక్కువ షాపులు తెరవడం, మార్కెట్ ప్రాంతాల్లో కూడా ఓపెన్ చేస్తారు. షాపింగ్ మాల్స్ గురించి ఇప్పుడే చెప్పకపోవచ్చు. జిమ్స్, సినిమా థియేటర్లు, మతపరమైన ప్రదేశాలు మూసే ఉంచుతారు. కొన్ని నగరాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు తెరిచారు. హ్యూమన్ రిసోర్స్ డైరక్టరీ మినిస్ట్రీ స్కూల్స్ రీ ఓపెన్ మీదే పని చేస్తున్నాయి. 9, 10, 11, 12 తరగతుల వారికి ముందుగా ఓపెన్ చేస్తారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. మాస్క్‌లు ధరిస్తూ.. రావాలి. అలాగే ప్రభుత్వం అన్నీ ఎయిర్‌లైన్ కంపెనీలకు ప్రయాణించే అనుమతులు కల్పించింది. డిమాండ్‌ను బట్టి ఆపరేటర్లే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం చెప్పేసింది.మరోవైపు వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు రైల్వేస్ శ్రామిక్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. మే 28 వరకు 3,736 రైళ్లు 50 లక్షల మంది కార్మికులను సొంతూళ్లకు తీసుకెళ్లాయి. ఇందులో గుజరాత్, మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్, బీహార్‌లకే ఎక్కువ మంది కార్మికులు వెళ్లారు. జూన్ 1 నుంచి 100 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే బస్సుల అంతర్రాష్ట్ర ప్రయాణాలు మొదలైపోయాయి. ఒడిశా-ఆంధ్రప్రదేశ్ కు ప్రయాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా జూన్ 1నుంచి మొదలు కానున్నాయి.