Home > Featured > దేశమంతా హిందీ మాట్లాడాల్సిందే.. అమిత్ షాపై నిప్పులు 

దేశమంతా హిందీ మాట్లాడాల్సిందే.. అమిత్ షాపై నిప్పులు 

Amit shah ..

బీజేపీ మళ్లీ ‘హిందీ’ అగ్గి రాజేసింది. దేశమంతా ఒకే భాష మాట్లాడాల్సిన అవసరం ఉందని, అప్పుడే భారత దేశానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అధినేత అమిత్ షా కలకలం సృష్టించారు. ఈశాన్య భారతంలోని విద్యార్థులకు హిందీ భాషను తప్పనిసరి చేయాలన్నారు. ఈ రోజు హిదీ దివసాన్ని పురస్కరించుకుని ఆయన సోషల్ మీడియాలో, సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.

‘భారతదేశం అనేక భాషలకు నిలయం. ప్రతి భాషకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే భారతీయులందరినీ ఐక్యంగా ఉంచాలంటే ఒకే భాష ఉండాలి. మాతృభాషతోపాటు హిందీ కూడా మాట్లాడాలి. అలా చేసినప్పుడే గాంధీ, సర్దార్‌ పటేల్‌ కలలు నెరవేరతాయి. ఎన్ని భాషలున్నా ఈ దేశానికి ఓ భాష అంటూ ఉండాలి. అలా ఉంటేనే ఈ దేశంలో పరాయి భాషలకు చోటుండదు. అందుకే మన స్వాతంత్ర్య సమరయోధులు హిందీని రాజభాషగా ముందుకు తెచ్చారు..’ అని అన్నారు.

రుద్దే హక్కు ఎవరిచ్చారు?

అమిత్‌ షా వ్యాఖ్యలపై తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ నేతలు భగ్గుమన్నారు. అందరిపైనా హిందీని రుద్దే హక్కు ఎవరిచ్చారని డీఎంకే నేత స్టాలిన్ మండిపడ్డారు. అమిత్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ వెంటనే స్పందించకపోతే మరో భాషా ఉద్యమం చెలరేగుతుందని హెచ్చరించారు. హిందీనే కాకుండా అన్ని భాషల్ని సమానంగా గౌరవించాలని బెంగాల్ సీఎం మమత హితవు పలికారు.

హింది, హిందుత్వ కంటే భారత్ పెద్దది.. ఒవైసీ

‘భారత్ హిందీ, హిందు, హిందుత్వ అనే ఆలోచనల కంటే చాలా పెద్దది. హిందీ భాష ప్రతీ భారతీయుడి మాతృభాష కాదు. అమిత్ షా ఈ దేశ బహుళత్వ సౌందర్యాన్ని, పలు మాతృభాషలను మెచ్చుకోలేరా?’ అని ఎంఐఎం అధినేత అసదుద్దన్ ఒవైసీ ట్వీట్ చేశారు. మన రాజ్యాంగంలోని ప్రతీ పౌరుడికి భాషా, సాంస్కృతిక హక్కును కల్పిస్తోందని అన్నారు.

Updated : 14 Sep 2019 9:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top