అబ్బే.. హిందీపై నేను అలా అనలేదే: అమిత్ షా - MicTv.in - Telugu News
mictv telugu

అబ్బే.. హిందీపై నేను అలా అనలేదే: అమిత్ షా

September 18, 2019

Amit shah ....

‘ఒకే దేశం ఒకే భాష’ కావాలని, దేశ ప్రజలు హిందీలో మాట్లాడాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెనక్కి తగ్గారు. ఇదెక్కడి నిరంకుశత్వమని దక్షిణాది భారతీయులు నిరసన గళం వినిపించడం, చివరికి బీజేపీ ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా తమకు మొదట కన్నడే ముఖ్యమని తేల్చేయడంతో వివరణ ఇచ్చారు. 

తాము దేశంపై హిందీని బలవంతంగా రుద్దడం లేదని, తమ అసలు అది ఉద్దేశం కానే కాదని అమిత్ షా ఈ రోజు మీడియాతో అన్నారు.‘మాతృభాష తర్వాత హిందీ నేర్చుకావాలన్నదే మా కోరిక. మేం ప్రాంతీయ భాషలను కించపరచం.  నా మాతృభాష కూడా హిందీ కాదు, గుజరాతీ. కానీ నేర్చుకున్నాను. నేను ఒక అర్థంలో మాట్లాడితే మీరు మరో అర్థం తీస్తున్నారు. రాజకీయాలు చేయాలనుకుంటే చేసుకోండి. కానీ, ప్రాంతీయ భాషలను వదులుకుని హిందీని జాతీయ భాషగా మార్చాలని నేనెప్పుడూ అనలేదు.  ఈ విషయాన్ని విమర్శించే వారికి విజ్ఞతకే వదిలేస్తున్నాను’ అన్నారు. 

కాగా, అమిత్ షా వ్యాఖ్యలపై దక్షిణాది ఇంకా ఆగ్రహంగానే ఉంది. కేంద్రం తమపై హిందీ బలవంతంగా రుద్దితే సహించబోమని అంటున్నారు. అమిత్‌ షా వ్యాఖ్యలను ఎవరూ ఆమోదించరని సూపర్ స్టార్ రజనీకాంత్‌ స్పష్టం చేశారు. దక్షిణ భారతంలో, ముఖ్యంగా తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమన్నారు.