నేడు లోక్‌సభ ముందుకు పౌరసత్వ సవరణ బిల్లు - MicTv.in - Telugu News
mictv telugu

నేడు లోక్‌సభ ముందుకు పౌరసత్వ సవరణ బిల్లు

December 9, 2019

Amit Shah

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పౌరసత్వ సవరణ బిల్లు-2019ను ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌‌లలో మతపరమైన అణచివేతను తప్పించుకుని మన దేశానికి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వాన్ని కల్పించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. 

తాజాగా ఈ బిల్లు లోక్‌సభ బిజినెస్‌లో లిస్ట్‌ అయింది. మంగళవారం నాటికే రెండు సభల్లో బిల్లు ఆమోదం పొందేలా మోదీ సర్కార్‌ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీలంతా తప్పనిసరిగా హాజరు కావాలంటూ ఇప్పటీకే పార్టీ విప్‌ జారీ చేసింది. ఎన్డీఏ మిత్ర పక్షాలతో పాటు మరికొన్ని పార్టీలు తమకు మద్దతు తెలుపుతాయని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. హోమ్ మంత్రి అమిత్ షా ఈ బిల్లును మధ్యాహ్నం ప్రవేశపెడతారని, తరువాత దీనిపై చర్చించి ఆమోదిస్తారని సమాచారం. ఈశాన్య రాష్ట్రాలలో అధికసంఖ్యలో ప్రజలు, ప్రజా సంఘాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తుండటంతో తీవ్ర స్థాయిలో నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. 1985 నాటి అసోం ఒప్పందంలో పేర్కొన్న నియమ నిబంధనలను ఈ బిల్లు కాలరాస్తోందని వ్యతిరేకులు విమర్శిస్తున్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య ప్రాంత విద్యార్థి సంఘం ఈ నెల 10న 11 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. వివక్షాపూరితంగా ఉన్న బిల్లును తాము వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే.