తెలుగులో అమిత్ షా ట్వీట్లు.. తెలంగాణ టార్గెట్?   - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగులో అమిత్ షా ట్వీట్లు.. తెలంగాణ టార్గెట్?  

September 24, 2018

సాధారణంగా ఉత్తరాది నేతలు హిందీకి, ఇంగ్లిష్‌కు పేద్దపీట వేస్తారు. దక్షిణాది భాషల్లో మాట్లాడాలంటే ‘అందరికీ నమస్కారం.. ఎల్లారుక్కుం వణక్కం..’ అని రెండు ముక్కలు మాట్లాడేసి వెళ్లిపోతారు. ఎన్నికల సీజన్ కనుక కొందరు మూడు నాలుగు వ్యాక్యాలు హిందీ స్క్రిప్టులో బట్టీపట్టి వల్లించేస్తారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా తెలుగులో ట్వీట్లేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ అమిత్ ట్వీట్లు పెట్టారు. ‘ప్ర‌ధాన‌మంత్రి మోదీ గారిచే ప్రారంభించ‌బ‌డిన‌ జ‌న ఆరోగ్య యోజ‌న- ఆయుష్మాన్ భార‌త్ కార్య‌క్ర‌మం ప్ర‌పంచంలోనే చాలా గొప్ప‌ది. అలాంటి కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అంద‌కుండా తెలంగాణ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించ‌డం బాధాక‌రం’ అని వాపోయారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వ స్వార్థ ఆలోచ‌న కార‌ణంగా పేదలు ఈ అద్భుత‌మైన కార్య‌క్ర‌మ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌లేక‌పోతున్నారని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ వాదన ఇదీ..

జ‌న ఆరోగ్య యోజ‌న- ఆయుష్మాన్ భార‌త్ పథకం కంటే తాము అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకమే ఉత్తమంగా ఉందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. తెలంగాణతో పలు రాష్ట్రాలు దీన్ని అమలు చేయబోమని చెప్పారు. ఢిల్లీ, ఒడిశా, కేరళ, పంజాబ్‌ రాష్ట్రప్రభుత్వాలు వివిధ పేర్లతో ఆరోగ్య పథకాలను అమలు చేస్తున్నాయి. కేంద్ర పథకంలో కఠిన నిబంధనలు ఉన్నాయని, దాంట్లో జాప్యం జరుగుతుందని, స్థానిక ప్రజలకు దాని గురించి సరిగ్గా తెలిసే అవకాశం లేదని అంటున్నాయి. తమ అవసరాలకు తగ్గట్టు కేంద్ర ప్రభుత్వంలో మార్పులు తెస్తే దీనిపై ఆలోచిస్తామంటున్ని. దీంతో బీజేపీ నేతలకు కోపమొస్తోంది.