అమితాబ్ ‘జుండ్’ టీజర్.. ‘సైరాట్’ దర్శకుడు, తెలుగు కెమెరామెన్.. - MicTv.in - Telugu News
mictv telugu

అమితాబ్ ‘జుండ్’ టీజర్.. ‘సైరాట్’ దర్శకుడు, తెలుగు కెమెరామెన్..

January 21, 2020

Amitabh

పరువు హత్యను కళ్లకు కట్టిన సంచలన చిత్రం ‘సైరాట్’ దర్శకుడు నాగరాజ్ మంజూలే మరో భారీ ప్రాజెక్టు చేపట్టారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్  ప్రధాన పాత్రతో ఆయన తెరకెక్కిస్తున్న ‘జుండ్’ సినిమా టీజర్ విడుదలైంది. ఫుట్ బాల్ కోచ్ విజయ్ బర్సే జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురికివాడల్లో ఉన్న పిల్లల కోసం ఆయన ఫుట్ బాల్ క్రీడల్లో మెలకువలు నేర్పిన తీరును ఇందులో తెరకెక్కించారు. స్లమ్ సాకర్ స్వచ్ఛంద సంస్థ పేరుతో చేసిన కృషిని ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ బయోపిక్‌కు సంబంధించిన టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

ఈ టీజర్ విడుదలైన వెంటనే విశేష ఆధారణ పొందింది. దీంట్లో పిల్లలు బ్యాట్లను పట్టుకుని ముందుకు వెళుతున్న సీన్ చేర్చారు. ఆకట్టుకునే బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ ఆకట్టుకుంది. సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి పెంచేలా దీన్ని రూపొందించారు. ‘సైరాట్’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలకు పనిచేసిన  తెలుగు కెమెరామెన్ సుధాకర్ రెడ్డి యక్కంటి దీనికి డీవోపీగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

కాగా విజయ్ బర్సే నాగపూర్‌లోని మురికివాడల్లో ఉండే చిన్నారులకు ఫుట్‌బాల్ ఆటపై ఆసక్తి పెంచేలా ఎంతో కృషి చేశారు. వారిని ఫుట్‌బాల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దే సమయంలో అతడు ఎదుర్కొన్న సవాళ్లను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే మరాఠీ చిత్ర దర్శకుడైన మంజులే తొలిసారి ఓ బాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహించడం.