భారతదేశ దిగ్గజ నటుల్లో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఒకరు. అమితాబ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదు దశాబ్దాలుగా తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆయన స్టైల్, డ్రెస్సింగ్ అయితే వేరే లెవల్. ఆ రోజుల్లో ఆయన వేసిన బెల్ ప్యాంట్లు ట్రెండ్ సెట్ చేశాయి. ప్రస్తుతం కాస్త సినిమాలను తగ్గించిన అమితాబ్..కౌన్ బనేగా కరోడ్పతి షోతో బుల్లితెరపై అలరిస్తున్నాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పలు విషయాలను షేర్ చేస్తు అభిమానులకు దగ్గరగా ఉంటాడు. తాజాగా 43 ఏళ్ల క్రితం విడుదలైన ‘దో ఔర్ దో పాంచ్’ సినిమా సమయంలో జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
‘దో ఔర్ దో పాంచ్’ సినిమా విడుదలై 43 ఏళ్లవుతున్న సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర ఘటన గురించి షేర్ చేశారు. ‘‘2 2=5; దో ఔర్ దో పాంచ్ సినిమా వచ్చి 43 ఏళ్లయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఎంత సరదాగా సాగిందో..! ఆ బెల్ బాటమ్ ప్యాంట్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ప్యాంటు వేసుకుని సినిమా చూడటానికి వెళ్లాను. అయితే..సీట్లో కూర్చున్న కాసేపటికే నా ప్యాంటులో ఓ ఎలుక దూరింది’’ అంటూ నవ్వుతున్న ఓ ఎమోజీని కూడా జతచేశారు.
ఈ పోస్టుతో పాటు అమితాబ్ షేర్ చేసిన పాత ఫోట్‌పై నెటిజన్ల నుంచి ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆ బెల్ ప్యాంట్లు ధరించకండి సార్ అని కొందరు అంటుంటే అప్పుడు..ఇప్పుడు ఒకేలా ఉన్నారంటూ కొందరు అభిమానులు పొగుడ్తున్నారు.‘ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్..అప్పుడు అమితాబ్ లుక్ వేరే లెవల్‌లో ఉంది” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.