Amitabh installs book shaped bench at Mumbai home jalsa
mictv telugu

పుస్తకం ఆకారంలో బెంచీ తయారు చేయించారు!

November 30, 2022

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన యార్డ్ లో ఉంచిన పుస్తకం ఆకారంలో ఉన్న బెంచ్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
అమితాబ్ బచ్చన్.. ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎనిమిది పదుల వయసులోనూ బాలీవుడ్ సూపర్ స్టార్ అంటే ఆయన పేరునే చెబుతారు. ఆయన తండ్రి హరివంశ రాయ్ బచ్చన్. ఈయన గొప్ప కవి, రచయిత. ఆయన జ్ఞాపకార్థం పోలాండ్ నుంచి ఒక బెంచీని రాతితో చెక్కించి తన నివాసంలో ఏర్పాటు చేసినట్లు బిగ్ బి తన బ్లాగ్లో వెల్లడించారు.

‘పోలాండ్లోని వ్రోక్లాలో రాతితో పుస్తక ఆకారంలో ఒక బెంచ్ చేశాం. నాన్నరాసిన మధుశాల పుస్తకంలోని కొన్ని అక్షరాలు దీని మీద చెక్కబడ్డాయి. ఆ బల్ల టన్ను బరువు ఉంటుంది. వ్రోక్లాలోని కౌన్సిల్ జనరల్ ఇండియాకి చెందిన శ్రీ కార్తికేయ జోహ్రీ ఈ బల్లను తీసుకురావడంలో సహాయం చేశారు. ఆయన నా తండ్రి విగ్రహాన్ని, స్టాంప్ తీసుకురావడంలో ఎంతో కృషి చేశారు. అంతేకాదు.. ఆధునిక హిందీ సాహిత్య అధ్యయనానికి పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించడంలో కృషి చేశారు. బాబూజీ(నాన్న)ని స్మరించుకుంటూ ఇప్పుడు నా పచ్చిక బయళ్ల మీదకి ఈ బెంచ్ వచ్చి చేరింది. ఇది ఎంత శుభప్రదమో అనిపిస్తున్నది. ఆయన నా మనస్సులోనే నిలిచి ఉంటారు. ఆయన పట్ల భక్తితో ప్రార్థిస్తున్నా’ అంటూ ఎంతో ఎమోషనల్ గా రాసుకొచ్చారు బిగ్ బీ.

రెండు దశాబ్దాలుగా బచ్చన్ కుటుంబం జల్సాలో నివాసం ఉంటున్నది. వాస్తవానికి ఈ ఆస్తిని బిగ్ బీ కొనుగోలు చేయలేదు. 80ల నాటి సూపర్ హిట్ చిత్రం ‘సత్తె పే సత్తా’ దర్శకుడు, నిర్మాత రమేష్ సిప్పి రెమ్యునరేషన్కి బదులు ఈ ఇంటిని బహుమతిగా ఇచ్చాడు. ఈ రెండంతస్తుల బంగ్లా అద్భుతమైన కళాకృతులతో నిర్మితమైంది. ఇప్పుడు ఈ ఇంటి ధర సుమారు 100 నుంచి 120 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.