పశువధ నిషేధం ఏదో గానీ…రైతులకు మాత్రం ఇక చుక్కలు కనిపించడం పక్కా. పశువుల క్రయవిక్రయాల్లో కష్టమైన కండీషన్స్ భరించాల్సిందే. పశువుల్ని అమ్మాలన్నా..కొనాలన్నా కంపల్సరీ రూల్స్ పాటించాల్సిందే. కొత్త రూల్స్ ప్రకారం కేవలం వ్యవసాయ పనుల నిమిత్తమే అమ్మడానికి తీసుకొచ్చామని, వాటిని పశువధశాలలకు అమ్మడం లేదని రైతులు లిఖితపూర్వకంగా రాసివ్వాలి. పశువుల మార్కెట్ కమిటీ దాన్ని ఆమోదించాలి. అంతే కాదు సదరు పశువులను కొనుగోలు చేసేది కూడా ఒక రైతేనని అతని దగ్గర ఉండే పత్రాలను చూసి అధికారులు ధృవీకరిస్తారు. ఇక కొనుగోలుదారు వాటిని పశువధశాలకు అమ్మబోనని లేదా వాటిని ఏ మత విశ్వాసాలకు అనుగుణంగా బలి ఇవ్వబోనన్న హామీ ఇవ్వాల్సి ఉంటుంది.
పాపం రైతన్న..అసలే కష్టాలే… పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేవు. కాలం కలిసిరాకపోకయినా ఏదో అలా నెట్టుకొస్తున్నాడు. కష్టాలు తీర్చుకోపోయినా ఫర్వాలేదు.. కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నారు పాలకులు.ఇప్పటిదాకా రైతులు పశువుల అమ్మకాలు, కొనుగోళ్లు వారాంతపు సంతల్లో చేసేవారు. ఎండకాలం వచ్చిందంటే మేత లేక కొందరు.. కాసే వారు మరికొందరు..ఎక్కువ పశువులు భారమై ఇంకొందరు రైతులు అమ్మేవాళ్లు.మళ్లీ వానకాలం నాటికి అవసరమైన కొత్తవాటిని తెచ్చుకునేటోళ్లు.పాలిచ్చే బర్రెల విషయంలో కూడా ఇంతే..వాటికి దున్నపోతు దూడలుంటే వాటిని కంపల్సరీ అమ్మేవాళ్లు. ఇదంతా వారాంతపు సంతలో జరిగేది. ఇక్కడ రైతులు రైతులకే అమ్ముతున్నారా..కబేళా మాఫియాకు అమ్ముతున్నారన్న విషయం వారికి అనవసరం.. పట్టించుకోకవాళ్లు కూడా..
ఇక ముందు అలా కుదరంటోంది కేంద్రం.
పశువధపై నిషేధం విధిస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది.‘‘వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే పశువులను కొనాలి… వధించడం కోసం కాదు’’ అని కేంద్రం స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు కొన్న తర్వాత ఆరు నెలల వరకు మళ్లీ అమ్మకూడదని షరతులు కూడా విధించడం పశువిక్రేతలకు చెక్ పెట్టేలా ఉంది. తాను ‘‘సేద్యకారుడిని’’ అని సరైన ధ్రువపత్రాలు చూపిస్తేనే ఇకపై ఆవులను విక్రయించాల్సి ఉంటుంది. 8 పేజీల మేర పలు నిబంధనలు రూపొందించిన కేంద్ర పర్యావరణ శాఖ… లేగదూడలు, పనిచేయలేని పశువులను విక్రయించకూడదని కూడా స్పష్టం చేసింది.
పశువిక్రయ కేంద్రాలు జాతీయ సరిహద్దుకు 50 కిలోమీటర్లలోపు, రాష్ట సరిహద్దుకు 25 కిలోమీటర్ల లోపులోనే ఉండాలని పేర్కొంది. రాష్ట్రానికి వెలుపల పశువులు విక్రయించే పక్షంలో సదరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి చేసింది. ప్రధానిగా మోదీ అధికారం చేపట్టాక కేంద్రం స్థాయిలో గోసంరక్షణపై నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. అయితే ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశం కావడంతో పశువధను కేంద్రం ఎలా నిర్మూలిస్తుందన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పశు విక్రేతలపై ప్రత్యేకించి ముస్లింలపై హిందూత్వ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. ఏప్రిల్ 1న హర్యానాకి చెందిన పాల వ్యాపారి పెహ్లూ ఖాన్‌పై రాజస్థాన్‌లో గోసంరక్షకులు దాడి చేసి చంపేశారు. నెలరోజుల క్రితం అసోంలో వధకోసం ఆవులను తరలిస్తున్నారంటూ ఇద్దరిని కొట్టిచంపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో గోవధపై నిషేధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ‘జంతు హింస నియంత్రణ చట్టం 1960’ కింద గురువారం నూతన నిబంధనలు నోటిఫై చేసింది.
కేంద్రం రూల్స్ బాగానే ఉన్నాయి అని అనించినా… అటొచ్చి ఇటొచ్చి కష్టాలు పడేది రైతులే. పొలం పనుల మానేసి ఇప్పుడు మార్కెట్ కమిటీ చుట్టూ తిరగాలి.జబ్బుపడిన ,పనిచేయలేని పశువుల్ని, పనికిరాని దున్నపోతు దూడల్ని ఏం చేయాలో గెజిట్ లో కేంద్రం చెబితే బాగుండేది.