నిధుల గోల్‌మాల్… ఎన్జీవోకు రూ.51 కోట్ల జరిమానా
అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ… ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా విభాగానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ రూ. 51.72 కోట్ల జరిమానా విధించింది. అంతే కాదు.. ఆ కంపెనీ మాజీ సీఈవో అకర్ పటేల్‌కు రూ. పది కోట్ల ఫైన్ విధించింది. విదేశాల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా విరాళాలను .. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి మరీ తీసుకొచ్చారని ఈడీ నిర్ధారించింది. గతంలోనే ఈ జరిమానాను విధించారు. ఇప్పుడు అడ్జుకేటింగ్ అధారిటీ ఆమోద ముద్ర వేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి పొందకుండా బ్రిటన్‌లోని సంస్థల నుంచి రూ.36 కోట్లు ఆమ్నెస్టీ స్వీకరించిందని ఈడీ ఆరోపించింది. ఈ సంస్థ వ్యాపార పద్ధతులను ఉపయోగించి ఈ నిధిని సేకరించిందని గతంలోనే పేర్కొంది. భారతదేశంలో తన ఎన్జీవో కార్యకలాపాలను విస్తరించేందుకు విదేశీ భాగస్వామ్య నియంత్రణ చట్టం (FCRA)ను ఉల్లంఘించినట్లు పేర్కొంది.
ఈ సంస్థ దేశంలోకి అక్రమంగా నిధులు తీసుకొస్తోందని.. మత మార్పిళ్లకు.. దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని బ్యాంకు ఖాతాలన్నిటినీ గతంలోనే నిలిపివేశారు. ఆ కారణంగా తమ సిబ్బందిని తొలగించింది. అమ్నెస్టీ సంస్థ ప్రచారాలను, పరిశోధనా కార్యక్రమాలన్నిటినీ నిలిపేయాల్సి వచ్చింది. భారత్ లో కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమ్నెస్టీ కార్యకలాపాలు ఇండియాలో లేవు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఫౌండేషన్ ట్రస్ట్ (AIIFT), విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం (FCRA) క్రింద ఉన్న ఇతర ట్రస్టులకు ముందస్తు రిజిస్ట్రేషన్, అనుమతులను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తిరస్కరించినప్పటికీ.. ఇది జరిగిందని ఈడీ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈడీ ఏం న్యాయవ్యవస్థ కాదని.. మళ్లీ పోరాడి కోర్టులో నెగ్గుతామని ఆకర్‌పటేల్ తాజాగా ట్వీట్ చేశారు.