ఆమ్రపాలి పెళ్లికి మీడియా హడావుడి! - MicTv.in - Telugu News
mictv telugu

ఆమ్రపాలి పెళ్లికి మీడియా హడావుడి!

February 12, 2018

ప్రముఖుల పెళ్లిళ్లన్నా.. వారి పిల్లల పెళ్ళిళ్లన్నా.. మొదటి హడావుడి చేసేది మీడియానే. రాజకీయ నాయకులు, సినిమా నటీనటులు వగైరా సెలబ్రిటీల ఇళ్లలో, వీధుల్లో, వీధి మలుపుల్లో..  ఏం జరిగినా వందలకొద్దీ వార్తలు మోసుకుంటాయి పత్రికలూ, చానళ్లూ. అయితే భుత్వాధికారుల పెళ్లిళ్లకు మీడియా ఇంత హడావుడి చేయదు. సీఎస్ వంటి ఉన్నతస్థాయి, రాష్ట్రస్థాయి అధికారుల ఇళ్లలో పెళ్లిళ్లయితే మొక్కుబడిగా రెండుమూడు వాక్యాల వార్త కనిపిస్తుంది పత్రికల్లో ఓ మూల. టీవీల్లో అయితే ఆ ఊసే ఉండదు.

ఇప్పుడు దీనికి మొత్తం వ్యతిరేకంగా సాగుతోంది. వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి కాటా తన స్నేహితుడైన ఐపీఎస్ అధికారి సమీర్‌శర్మను ఈ నెల 18న జమ్మూలో పెళ్లి చేసుకుంటుండం తెలిసిందే. అసలే జనం మెచ్చిన ఆమ్రపాలి.. ఆపై ఆమె పెళ్లి..! మీడియాలో కొన్నాళ్లుగా ఇదే హడావుడి.. ఆమె 18న పెళ్లి చేసుకుంటోందని తెలిసి చాలారోజులైనా.. మళ్లీ ఆమె పెళ్లి డేట్ ఫిక్స్ అంటూ కొత్త విషయం చెబుతున్నట్లు ఒకటే వార్తలు.. ఆమ్రపాలి ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 7 వరకు సెలవులు పెట్టిందని, ఆమె పెళ్లి కార్డును ప్రత్యేకంగా రూపొందిస్తున్నారని, 23న వరంగల్‌‌లో, 25న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుందని.. ఊదరగొడుతున్నారు.. చివరికి ఆమ్రపాలి చెప్పిందో లేదో తెలియకున్నా ఆమె హనీమూన్‌కు టర్కీకి వెళ్తున్నట్లు రాసేస్తునారు.

ఎందుకింత క్రేజ్!

ఆమ్రపాలి ఈ తరం యువతీయువలకు నచ్చే యువతి అనడంలో సందేహం లేదు. ఆమె అందచందాలు, ఆధునిక వస్త్రధారణ, కొండలెక్కడం వంటి విన్యాసాలు జనాన్ని విపరీతంగా ఆకర్షిస్తున్నారు. మామూలుగా కలెక్టర్ అంటే  ఫార్మల్ దుస్తులు వేసుకుని, చాల సీరియస్‌గా, ఫైళ్లు పట్టుకును, ఏవేవో ఆదేశాలు ఇచ్చే అధికారి రూపం కనిపిస్తుంది. ఆమ్రపాలి అందుకు భిన్నం. ఓ సాధారణ యువతిలా అందరిలోనూ కలసిపోతుంది. చక్కగా డ్యాన్సులు చేస్తుంది.. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. రిపబ్లిక్ డే ప్రసంగంలోనూ నవ్వడం తెలిసిందే. లైఫ్‌ను లైట్‌గా తీసుకునే నేటి తరం యువతలో ఇలాంటి మరెన్నో గుణాలు కుప్పబోసిన సదరు కలెక్టరమ్మంటే క్రేజ్ ఉండడం సహజమే.

మీడియా హడావుడి ఎందుకు?

అన్ని రంగాలు వ్యాపారం అయిపోయినట్లే మీడియా కూడా వ్యాపారం అయిపోయింది. ఎవరు ఎంత ఎక్కవ ‘ఆకర్షణీయ’ వార్తలు, ఫొటోలు, వీడియోలు అందిస్తే వారికంత లాభం. సర్క్యులేషన్, టీఆర్పీరేటింగ్, వ్యూస్.. ఇవన్నీ ఎలాంటి వార్తలు ఇవ్వాలనేదాన్ని ప్రభావితం చేస్తాయి. జనం నచ్చే,  మెచ్చే వార్తలకే మీడియా ప్రధానం ఇస్తుంది. ఇక్కడ విచక్షణ, నైతికత వంటి విలువలకు చోటులేదు. వరంగల్ జిల్లాలో అప్పుల బాధతో ఒక రైతు ఆత్మహత్య అనే వార్తకంటే, ఆమ్రపాలి పెళ్లిలో వడ్డించే వంటలేంటో తెలుసా? అనే వార్తలకే ఎక్కువ పాఠక,వీక్షకాదరణ ఉంటుంది.. ! అందుకే ఇప్పుడు మీడియా అంతా ఆమె నామస్మరణ చేస్తోంది..!!  ఒక్కముక్కలో చెప్పాలంటే యథాప్రజా తథా మీడియా. ప్రజ అంతా ఆమ్రపాలి చుట్టూ తిరుగుతుంటే మీడియా వేరే సామాజిక సమస్యల చుట్టూ తిరుగుతుందా? మీరే చెప్పండి..