మరో బాలీవుడ్ నటి త్వరలో తల్లి కాబోతున్నది. ఇప్పటికే నటి అనుష్క శర్మ గర్భవతి అయిన సంగతి తెల్సిందే. తాజాగా మరో నటి అమృతా రావు కూడా త్వరలో తల్లి కాబోతున్నది. ఈ విషయాన్ని అమృతా రావు-ఆర్జే అన్మోల్ దంపతులు అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ, ఇటీవల చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లిన ఈ జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ ఫొటోల్లో అమృత గర్భంతో కనిపిస్తుంది. ఆమె గర్భం దాల్చిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో వారి అభిమానులు సోషల్ మీడియా ద్వారా అభినందలు తెలుపుతున్నారు. అమృత, ఆర్జే అన్మోల్ ఏడేళ్ల పాటు ప్రేమించుకుని, 2016లో పెళ్లి చేసుకున్నారు. అన్మోల్ రేడియో జాకీగా పనిచేస్తున్నాడు. 2002లో వచ్చిన ‘అబ్ కె బరస్’ అనే హిందీ సినిమా ద్వారా కెరీర్ మొదలెట్టిన అమృత ‘వివాహ్’, ‘ఇష్క్ విష్క్’, ‘మై హూనా’ వంటి సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించింది. 2007లో వచ్చిన ‘అతిథి’ సినిమా ద్వారా తెలుగులోకి తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమె సూపర్ స్టార్ మహేష్‌బాబు సరసన నటించింది. ఆమె చివరిసారిగా మరాఠా నాయకుడు బాల్ ఠాక్రే జీవితం ఆధారంగా 2019లో తెరకెక్కిన ‘ఠాక్రే’ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై ‘జమ్మీన్’ అనే మ్యూజిక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.