ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నేత అమృత్‌పాల్ సింగ్ పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని బలంగా నిర్ణయించుకున్న పోలీసులు.. వంద వాహనాలు.. వందల మంది స్టేట్ స్పెషల్ టీమ్‌లతో.. అతడిని వేటాడేందుకు బయల్దేరారు. అతడి చుట్టూ వందల మంది సాయుధులైన అనుచరులున్నా, అతడి కాన్వాయ్‌ను వెంటాడారు. కానీ అతడు మాత్రం ఇప్పటిదాకా పోలీసులకు చిక్కలేదు. షాకోట్ తాలుకాలోని జలంధర్‌కు వెళ్తున్న అమృత్‌పాల్ సింగ్ రాక గురించి ముందే తెలుసుకున్న పోలీసులు.. ఆ ఊరి చుట్టూ పారామిలటరీ బలగాలను మోహరిం చినా అతడిని పట్టుకోలేక పోయారు.
ఇక అమృత్‌పాల్ సింగ్ పాకిస్థానీ ఐఎస్ఐ ఏజెంట్ అని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ పాకిస్థానీ గూఢచార సంస్థ భారత దేశంలో హింసను సృష్టించేందుకు, ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమాన్ని రగిలించేందుకు ఆయనను భారత దేశానికి తీసుకొచ్చిందని వెల్లడిస్తున్నాయి. శనివారం అమృత్‌పాల్.. జలంధర్‌లోని షాకోట్‌కు అతడు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ప్లాన్ ప్రకారం, అతడిని అరెస్ట్ చేసేందుకు జలంధర్, మొగా పోలీసుల బృందం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టింది. ఈ విషయం తెలియగానే అమృత్‌పాల్ పారిపోయాడు. అతని 78 మంది అనుచరులను అరెస్టు చేశారు పోలీసులు. ఈ అరెస్టుల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తెలెత్తకుండా పంజాబ్ వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపి వేస్తూ రాష్ట్ర హోం వ్యవహారాలు, న్యాయ శాఖ నిర్ణయం తీసుకుంది.