పంజాబ్‌లోని అమృత్సర్ నుంచి సింగపూర్ వెళ్తున్న విమానం.. ప్రయాణికులను ఎక్కించుకోకుండానే వెళ్లింది. షెడ్యూల్ ప్రకారం బుధవారం రాత్రి 7.55 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉండగా.. దాదాపు 5 గంటల ముందే అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో 35 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. దీంతో అమృత్సర్ ఎయిర్ పోర్ట్‌లో 35 మంది ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు.
స్కూట్ ఎయిర్‌లైన్ విమానం బుధవారం రాత్రి 7.55 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, అది మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరింది. విమాన సమయం మార్పు గురించి ప్రయాణికులకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేసినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ-మెయిల్‌ను పరిశీలించిన తర్వాత విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులతో విమానం ఎగిరిందని స్కూట్ పేర్కొంది. గత నెలలో కూడా ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకున్నది. ఢిల్లీకి వెళ్తున్న గో ఫస్ట్ ఫ్లైట్ విమానం 50 మంది ప్రయాణికులను ఎయిర్‌పోర్టులోనే వదిలి వెళ్లడం గమనార్హం.