సీన్ రివర్స్.. వధువు కాళ్ళు మొక్కిన వరుడు - MicTv.in - Telugu News
mictv telugu

సీన్ రివర్స్.. వధువు కాళ్ళు మొక్కిన వరుడు

September 25, 2020

Amsterdam couple Proposal In Udaipur

హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిలో కొన్ని ఆడవాళ్లు మాత్రమే పాటించే సంప్రదాయాలు ఉంటాయి. వాటిలో ఒకటి మాంగళ్యధారణ తరువాత వధువు వరుడి కాళ్లను నమస్కరించడం. వరుడు ఎప్పుడూ వధువు కాళ్లకు నమస్కరించడు. అలాగే పెళ్లి తరువాత వధువు ఇంటిపేరు మారుతుంది. వరుడు తన ఇంటిపేరు మార్చుకోడు. ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఓ పెళ్ళిలో సీన్ రివర్స్ అయింది. ఉదయ్‌పూర్‌కు చెందిన దీపా ఖోస్లా ఉన్నత చదువుల కోసం నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌కి వెళ్ళింది. అక్కడే ఆమెకు విద్యార్థి నాయకుడు ఒలేగ్‌ బుల్లర్‌తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం క్రమంగా ప్రేమగా మారింది.

వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. వీరు యూరోపియన్‌, భారతీయ సంస్కృతుల సంపూర్ణ కలయికగా పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగుతుండగా దీపను ఒలేగ్‌ పాదాలకు నమస్కరించమని పురోహితుడు చెప్పాడు. అప్పుడు వధూవరులు కేవలం ఆడవారు మాత్రమే ఎందుకు అలా చెయ్యాలి అని ప్రశ్నించారు. వెంటనే వరుడు వధువు పాదాలను తాకాడు. అలాగే వారు ఒకరి ఇంటి పేరు ఒకరం మార్చుకున్నారు. వధువు దీప బుల్లర్‌ ఖోస్లా అని పెట్టుకోగా.. వరుడు ఒలేగ్‌ బుల్లర్‌ ఖోస్లా అని మార్చుకున్నాడు. ఇలా చేయడం చాలా గర్వంగా ఉందని వధూవరులు తెలిపారు. వీరి పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సాంప్రదాయం ఎదో బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.