పానీపూరి తింటూ లక్ష రూపాయలు మర్చిపోయిన నటి - MicTv.in - Telugu News
mictv telugu

పానీపూరి తింటూ లక్ష రూపాయలు మర్చిపోయిన నటి

June 1, 2022

అమ్మాయిల ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ఏదంటే అందరూ పానీపూరీనే చెప్తారు. అవి తినడం వాళ్లకెంత ఇష్టమంటే అవి తింటూ ఏకంగా లోకాన్నే మర్చిపోతుంటారు. సాధారణ అమ్మాయిలే కాదు, సెలెబ్రిటీలు, హీరోయిన్లు కూడా దీనికి అతీతం కాదు. ఇది నిజమని నిరూపించే ఓ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. హృతిక్ రోషన్ నటించిన బాలీవుడ్ హిట్ సినిమాలు కోయి మిల్ గయా, కహోనా ప్యార్ హైలలో నటించిన కామ్య పంజాబీ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇండోర్ వెళ్లింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత వారిచ్చిన లక్ష రూపాయల పారితోషికాన్ని తీసుకొని పక్కనే ఉన్న పానీపూరీలను ఓ పట్టు పట్టింది. అంతకు ముందు పారితోషికం ఉన్న ఎన్వలప్ కవర్‌ను అక్కడే ఉన్న టేబుల్‌పై పెట్టింది. తిన్న తర్వాత కవరుని తీసుకోకుండా వచ్చిన అభిమానులతో ఫోటోలకు ఫోజులిస్తూ తర్వాత హోటల్ రూంకి వెళ్లిపోయింది. కాసేపటికే కవరు గుర్తుకు వచ్చి పానీపూరీ తిన్న చోటుకి తన మేనేజరుని పంపించింది. మేనేజరు వెళ్లి చూడగా, కవరు పెట్టిన చోటే ఉండడంతో తీసుకొని వచ్చాడు. ఈ విషయాన్ని కామ్య షేర్ చేస్తూ ఇండోర్ ప్రజల మంచితనాన్ని మెచ్చుకుంది. దొరకదు అనుకున్న డబ్బు దొరకడంతో ఊపిరి పీల్చుకుంది.