కొత్త విధానంతో భారీగా లాభపడిన అమెరికా కంపెనీ.. ఇండియాలో సాధ్యమయ్యేనా? - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త విధానంతో భారీగా లాభపడిన అమెరికా కంపెనీ.. ఇండియాలో సాధ్యమయ్యేనా?

April 26, 2022

కరోనా ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది. దాంతో పాటు అనేక మార్పులకు కారణమైంది. లాక్ డౌన్ వల్ల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానానికి అలవాటు పడ్డారు. అంతేకాక, జీవన వ్యయం ఎక్కువవడంతో కోరుకున్న జీతం ఇచ్చే కంపెనీకి వెంటనే జంప్ అవుతున్నారు. ఈ సమస్య ఇండియాలోని ప్రముఖ ఐటీ కంపెనీలకు కూడా ఉంది. అయితే దీనికి పరిష్కారంగా అమెరికాకు చెందిన ఓ కంపెనీ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దాని వల్ల ఉద్యోగులను నిలుపుకోవడమే కాకుండా ఉత్పాదకత గణనీయంగా పెంచుకోగలిగింది. వివరాలు.. అమెరికాకు చెందిన ‘హెల్త్ వైజ్’ అనే కంపెనీకి గతేడాది ఆగస్టుకు ముందు దాదాపు 200 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. దాంతో కంపెనీ సమస్య పరిష్కారానికి ప్రముఖ సామాజిక, ఆర్ధిక వ్యవహారాల నిపుణులు, బోస్టన్ కాలేజీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జూలియట్ షోర్ సిఫారసులను అమలు చేసింది. ఉద్యోగులు కోరుకున్న జీతాలు, ప్రమోషన్లు, వారానికి నాలుగు రోజుల పనిదినాలు వంటి సలహాలను ప్రయోగాత్మకంగా పాటించింది.

దీంతో సత్ఫలితాలు వచ్చాయి. ఉద్యోగుల పనితీరు మెరుగుపడి, ఉత్పాదకత పెరిగి, సంస్థకు మంచి లాభాలు వచ్చాయి. వారంలో మూడు రోజులు సెలవు దొరకడంతో ఉద్యోగులు వారి వ్యక్తిగత జీవితాన్ని మరింత ఆనందంగా గడపడానికి దోహదపడింది. దీంతో ఇదే బాగుందని కంటిన్యూ చేయడంతో రాజీనామాకు సిద్ధపడిన ఉద్యోగులు వాటిని విరమించుకున్నారని సంస్థ సీఈఓ ఆడమ్ హుస్నీ వెల్లడించారు. కాగా, మన దేశంలో కూడా వారానికి నాలుగు రోజుల పని దినాలను అమలు చేయాలని ఉద్యోగుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే ఓ కంపెనీ ఈ విధానాన్ని అమలు చేసింది. చూద్దాం మరి భవిష్యత్తులో అన్ని రంగాల్లో సాధ్యపడుతుందో లేదో.