An article on the death of Lal Bahadur Shastri
mictv telugu

లాల్ బహదూర్ శాస్త్రిది హత్యేనా? ఏది నిజం!!

July 22, 2022

An article on the death of Lal Bahadur Shastri

భారత దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది. అమెరికా పాత్రికేయుడు గ్రెగరీ డగ్లస్ తాజా పుస్తకంలో శాస్త్రిని చంపింది తామేనని అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ అధికారి రాబర్ట్ క్రౌలీ చెప్పినట్టు ఉండడం దీనికి కారణం.

1966లో అంటే, శాస్త్రి మరణ సమయంలో సీఐఏలో పనిచేసిన రాబర్ట్ క్రోలీతో జరిపిన సంభాషణలను గ్రెగరీ ‘Conversations with the Crow’ పేరుతో పుస్తక రూపంలో తెచ్చారు. ఈ పుస్తకం 2013లో అచ్చయినప్పుడు కొంత వివాదం నడిచి సద్దుమణిగింది. తాజాగా ఇందులోని రెండు పేజీలను ట్విటర్ యూజర్లు పోస్టు చేయడంతో దాదాపు పదేళ్ల తర్వత మళ్లీ కలకలం రేగింది. శాస్త్రితోపాటు భారత అణుశాస్త్ర పితామహుడు హోమీ బాబాను చంపింది సీఐఏ అని ఆ పుస్తకంలో ఉన్నట్లు పేజీలు చెబుతున్నాయి. ఆ వివరాల ఆధారంగా శాస్త్రి మరణంపై విచారణ జరుపాలని ఆయన కొడుకు, మనవడు ట్వీట్ చేశారు.

వీడని మిస్టరీ

సాధారణంగా ఎవరైనా ప్రమాదంలో చనిపోయినా, ఆత్మహత్య చేసుకుని చనిపోయినా పోస్టుమార్టం చేస్తుంటారు. కానీ ప్రధాని హోదాలో ఉన్న శాస్త్రి చనిపోతే ఎలా చనిపోయారో తెలుసుకోవడానికి అటు తాష్కెంటులో కానీ, ఇటు భారత్‌లో కానీ, ఆయన మృతదేహానికి పోస్టుమార్టం చేయలేదు. ఆయన శరీరం నీలిరంగులో మారిపోవడమే కాక, ఒంటిపై గాయాలున్నాయి. శాస్త్రికి రాత్రి పడుకునే ముందు పాలు తాగే అలవాటుంది కాబట్టి దాని ద్వారా విషప్రయోగం జరిగిందనేది అప్పట్లో వచ్చిన గట్టి అనుమానం. కానీ, ఆయన మరణంపై ఇప్పటివరకు విచారణ కోసం కమిషన్లు వేసినా ఒక్క నివేదిక లేదు. అలాగే చనిపోవడానికి కొద్ది ముందు తానొక ప్రత్యేక వ్యక్తిని కలిశానని కుటుంబసభ్యులతో చెప్పారు. ఆ వ్యక్తి నేతాజీ అని, కొద్ది రోజుల్లో వచ్చే గణతంత్ర దినోత్సవంలో ఆయనను దేశానికి పరిచయం చేయాలనుకున్నారని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు వీటన్నింటినీ చూస్తే మొదటగా అనుమానం వచ్చేది రాబర్ట్ క్రౌలీ చెప్పిన మాటలపైనే.

 

అమెరికా, రష్యాలు చేతులు కలిపాయా?

ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోయి సోవియట్ రష్యా, అమెరికాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. బద్ధ శత్రువులుగా ఉన్న ఈ రెండు దేశాలు శాస్త్రిని చంపడానికి ఎలా ఒక్కటవుతాయని మిలియన్ డాలర్ల ప్రశ్న. రష్యా ఆధీనంలో ఉన్న తాష్కెంటులో సీఐఏ ప్రవేశించి ఓ దేశ ప్రధానిని చంపేంత బలహీన సెక్యూరిటీ రష్యా కలిగి ఉందా? ఇక శాస్త్రి చనిపోయి ఐదు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు ఈ వార్త రావడం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లేదు. కేవలం ఓ పుస్తకంలో వచ్చినంత మాత్రాన దానిని ప్రామాణికంగా తీసుకోలేరు. గ్రెగరీకి చెప్పిన రాబర్ట్ క్రోలీ 2000లో చనిపోయాడు.

ఇప్పుడు విచారణ జరిపితే?

ఇప్పుడు పూర్తి స్థాయి విచారణ జరిపితే నిజాలు బయటికి వస్తే అమెరికా గానీ, రష్యా గానీ తప్పును ఒప్పుకుంటాయా? ఇక ఆర్టీఐ ద్వారా కేంద్రానికి ఎన్నో అర్జీలు వచ్చాయి. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యత్తరాలు బయటపెట్టమని, కానీ, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈ అభ్యర్ధనలను తిరస్కరించాయి. ఏది ఏమైనా నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగే శాస్త్రి మరణం కూడా మిస్టరీగా మిగిలిపోయింది. నేతాజీ విషయంలో కూడా భారత ప్రభుత్వం శాస్త్రి విషయంలో వ్యవహరించినట్టే వ్యవహరించింది. గట్టిగా అడిగితే దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయనీ తమ అధికారుల ద్వారా లీకులు ఇచ్చారు. అంతేకానీ, అసలు నిజాలు మాత్రం ప్రజలకు తెలియనివ్వరు.