An attempt to steal from Mahesh Babu's house..the thief got injured..in the end
mictv telugu

మహేశ్ బాబు ఇంట్లో చోరీకి యత్నం..గాయపడిన దొంగ..చివరికి

September 29, 2022

టాలీవుడ్‌ అగ్రహీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని, తెలుగు ప్రేక్షకుల మదిలో సూపర్ స్టార్‌‌గా పేరుగాంచి, తన ట్రస్ట్ ద్వారా వందలాది మంది చిన్న పిల్లలకు గుండె ఆఫరేషన్లు చేయిస్తూ, నటుడు మహేశ్ బాబు మంచి పేరుతో ముందుకెళ్తున్నారు. అయితే, తాజాగా మహేశ్ బాబు ఇంట్లో చోరీకి యత్నించి, ఓ దొంగ తీవ్రంగా గాయపడిన సంఘటన చోటుచేసుకుంది.

కాపలాదారులు తెలిపిన వివరాల ప్రకారం..”మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మహేశ్ బాబు ఇంట్లో చోరీ చేయడానికి వచ్చి, ఓ దొంగ 30 అడుగుల గోడ దూకి, తీవ్రంగా గాయపడ్డాడు. ముందుగా ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించాలని ఆ దొంగ అనుకున్నాడు. అనుకున్నట్టే, గోడ ఎక్కి కిందికి దూకాడు. కానీ, అది చాలా ఎత్తుగా ఉండడంతో ఒక్కసారిగా కిందపడి, తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పెద్ద శబ్దం వచ్చింది. అనుమానం వచ్చి బయటికొచ్చి చుశాం. ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించాం” అని చెప్పుకొచ్చారు.

అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు..అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అతడు అసలు విషయాన్ని తెలియజేశాడు. ‘నా పేరు కృష్ణ (30). మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి వచ్చాను. ఓ నర్సరీ వద్ద ఉంటున్నాను. అవసరాల రీత్యా దొంగతనం చేస్తుంటాను. 30 అడుగుల ఎత్తైన గోడపై నుంచి ఒక్కసారిగా దూకడంతో, తీవ్రంగా గాయపడ్డాను’ అని అన్నాడు. దొంగను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటన జరిగినప్పుడు మహేశ్ బాబు ఇంట్లో లేరని పోలీసులు వివరాలను వెల్లడించారు.