రోడ్ల దుస్థితిపై లైవ్ రిపోర్టింగ్.. అంతలో వెనకనుంచి ఊహించని ట్విస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్ల దుస్థితిపై లైవ్ రిపోర్టింగ్.. అంతలో వెనకనుంచి ఊహించని ట్విస్ట్

September 23, 2022

ఇటీవల కురిసిన వర్షాలకు దేశంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల గుంతలు దర్శనమిస్తుండగా, గతుకుల రోడ్లపైనే ప్రయాణించి వాహనాలతో పాటు ప్రయాణీకులు కూడా తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అనేక చోట్ల రోడ్లను బాగు చేయమని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా ఫలితం లేకుండా పోతుంది. దీంతో కొన్ని గ్రామాల్లో ప్రజలే చందాలు వసూలు చేసుకొని రోడ్లను బాగు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలను రిపోర్టర్లు తమ ఛానళ్లలో ప్రసారం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాగే ఓ గ్రామంలో రోడ్డు ధ్వంసమైతే న్యూస్ రిపోర్టర్లు లైవ్‌లో ప్రసారం చేస్తున్నారు.

 

ఇంతలో లైవ్‌లో మాట్లాడుతున్న రిపోర్టర్ వెనుక ఓ ఊహించని ఘటన జరిగింది. వివరాల్లోకెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రం బల్లియా ప్రాంతంలో రోడ్డు బాగా ధ్వంసమైపోయింది. ఓ రిపోర్టర్ రోడ్డు దుస్థితిపై లైవ్‌లో మాట్లాడుతూ వివరిస్తుండగా, వెనుక నుంచి గతుకుల రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనాలు గుంతల్లో పడిపోతున్నాయని రిపోర్టర్ చెప్తుండగా, ఇంతలో ఓ ఎలక్ట్రిక్ వాహనం గుంతల మీదుగా వెళ్తూ బురదలో పడిపోయింది. అందులో ఉన్నవారంతా నీటిలో పడిపోయారు. వెంటనే స్పందించిన కెమెరామెన్, రిపోర్టర్ వారికి సహాయం అందించారు. వారితో స్థానికులు కూడా జతకలిసి బురదలో పడ్డ వారిని బయటకు తీశారు. ఈ వీడియోను పీయూష్ రాయ్ అనే జర్నలిస్టు ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, వైరల్ అయింది. అటు ఘటన గురించి తెలుసుకున్న అధికారులు స్పందించి రోడ్డుకు తాత్కాలిక మరమ్మత్తులు చేసినట్టు తెలిసింది.