An Entire Spanish Village Is On Sale For Rs.2.1 Crore
mictv telugu

అమ్మకానికి ఒక ఊరు.. కేవలం రూ. 2కోట్లే..

November 13, 2022

కారు, బంగ్లా, విల్లా.. ఇలాంటి వాటిని కొనాలని మనలో చాలామంది ఎన్నో కలల కంటారు. కొందరు సాకారం చేసుకుంటారు కూడా. అయితే మీరు ఎప్పుడైనా మొత్తంగా ఓ గ్రామాన్నే కొనాలనుకున్నారా? ఒకవేళ అలా కలల కనుంటే మాత్రం.. అమ్మకానికి ఓ ఊరు రెడీగా ఉంది. విచిత్రం ఏంటో తెలుసా.? ఆ ఊరు 30 సంవత్సరాలకు పైగా ఖాళీగా ఉంది. అంటే జనావాసాలు లేని గ్రామం. స్పెయిన్‌లోని జమోరా ప్రావిన్స్‌లో గల సాల్టో డి కాస్ట్రో అనే గ్రామం పోర్చుగల్ సరిహద్దులో ఉంది.

2000 సం.లో అంటే 22 ఏండ్ల క్రితం ఓ వ్యక్తి ఈ గ్రామాన్ని ఓ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చే లక్ష్యంతో కొన్నాడట. అయితే యూరప్ ఆర్ధిక సంక్షోభం కారణంగా అతని ప్లాన్ వర్కవుట్ కాలేదు. అయితే ప్రస్తుతం అతడు ఆ గ్రామాన్ని వేరే ఇంకెవరికైనా అమ్మి , మొత్తంగా పర్యాటక స్థలంగా చూడాలనుకుంటున్నాడని అతడి కంపెనీలో పనిచేస్తున్న రోనీ రోడ్రిగ్జ్ అనే ఉద్యోగి చెప్పాడు. తన యజమాని తన కలను ఈ గ్రామాన్ని ఇతరులకు అమ్మి దాని పర్యాటక ప్రదేశంగా చూడాలనుకుంటున్నాడట. ఈ గ్రామాన్ని ఆన్ లైన్ ద్వారా అమ్మకానికి పెడితే 50,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయట. బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం మరియు రష్యా నుండి 300 కంటే ఎక్కువ మంది ఈ గ్రామాన్ని కొనడానికి ఆసక్తి చూపుతున్నారట.

అంత విశేషం ఏముందంటారా… 44 ఇళ్లు, ఒక హోటల్, చర్చి, స్కూల్, మునిసిపల్ స్విమ్మింగ్ పూల్ మరియు సివిల్ గార్డు ఉండే బ్యారక్స్ భవనం.. ఇన్ని సదుపాయాలు ఉన్నప్పుడు కచ్చితంగా విశేషమే. ఇంతకీ ఈ ఊరి రేటు ఎంతంటే.. 227,000 యూరోలు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 2,16,87,831(రూ.2.1కోట్లు). స్పెయిన్‌లోని మాడ్రిడ్ నుండి ఈ ఊరికి మూడు గంటల ప్రయాణం. కొంతమంది ఈ గ్రామాన్ని కొనడానికి ముందే అడ్వాన్స్ ఇస్తున్నారని చెబుతున్నాడు రోడ్రిగ్జ్. రెండు కోట్లకే ఊరంతా వస్తుంటే ఆ మాత్రం తొందరపడకుండా ఎవరుంటారు..