మనోళ్లు రోజుకు 70 నిమిషాలు వీడియోల్లోనే..
ఒకరి వెర్రి ఇంకొకరికి సొమ్ము చేస్తుందట.. అన్నట్టుగానే వుంది మన భారతీయ యువత పరిస్థితి చూస్తుంటే. మన వినోద ప్రియులు ఈమధ్య మరింత రెచ్చిపోతున్నారు. నిద్రలు మాని రాత్రుళ్లు జాగారాలు చేసి, తిండి తిప్పలు లేకుండా అదేపనిగా ఫోన్ పట్టుకుని వరుస వీడియోలు చూసేస్తున్నారు. ఇలా చూస్తుంటే చూసినవారి ఆరోగ్యం పాడు అవడం అటుంచితే కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు క్యాష్ చేసుకుంటున్నాయి.
భారతీయ యువత రోజులో సగటున 70 నిమిషాల పాటు ఫోన్‌తోనే సమయం గడిపేస్తున్నారని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అత్యధికమంది ఓటీటీ ఫ్లాట్‌ఫాంల వేదికగా వీడియోలు చూడటానికి ఇష్టపడుతున్నారని పేర్కొంది. యువత ఇష్టానుసారంగా నడుచుకోవాలని ఆయా వేదికలు నిర్ణయించుకున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆయా వేదికలు వివిధ షోలను నిర్మిస్తున్నాయట. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో ఏడు భారతీయ భాషలలో స్పెషల్ షోలను నిర్మించడం ద్వారా హాట్ స్టార్ రూ.120 కోట్లు ఆర్జించింది. ఏరోస్ నౌ వందకు పైగా కొత్త షోలను నిర్మించడానికి యాభై మిలియన్ డాలర్లతో రంగంలోకి దిగుతోంది.
జీ 5 కూడా మార్చి 2020 కల్లా ఆరు భాషలలో 72 కొత్త షోలను సమర్పించడానికి సిద్ధం అవుతున్నది. దేశంలోని చిన్న చిన్న నగరాలలో కూడా డేటా, డిజిటల్ పరికరాలు అతి తక్కువ ధరకు లభిస్తుండటంతో ఓవర్ ద టాప్ (ఓటిటి) ప్రసారాలకు మార్కెట్‌లో బాగా డిమాండ్ పెరిగిందని ఏరోస్ డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిషిక లుల్లా సింగ్ తెలిపారు.