An NGO designed an invitation card for a divorce ceremony
mictv telugu

వేడుకగా విడాకుల సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఆహ్వాన పత్రిక

September 12, 2022

భార్యల వేధింపులకు గురవుతున్న భర్తలు మన సమాజంలో నానాటికీ పెరుగుతున్నారు. వీరి కోసం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భార్యా బాధితుల సంఘాలు ఏర్పడ్డాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘాలు ఉన్నట్టు అప్పుడప్పుడు వార్తల్లో వస్తుంటుంది. అలాగే మధ్యప్రదేశ్‌లో భార్యా బాధితులకు అండగా, భాయ్ వెల్ఫేర్ సొసైటీ అనే ఎన్జీవో సంస్థ నిలుస్తోంది. ఈ సంస్థ కొత్తగా విడాకులు తీసుకున్న 18 మంది మగవాళ్ల తరపున విడాకుల సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాక, ఈ వేడుక తరపున ఆహ్వాన పత్రిక తయారు చేయించి అందులో వేడుకల వివరాలను పేర్కొంది. ముఖ్యంగా జయమాల విసర్జన్ (వివాహ మాల నిమజ్జనం, సంగీతం, సామాజకి సేవ కోసం ప్రతిజ్ఞలు, మనస్సాక్షిని శుభ్రపరిచే పవిత్రమైన అగ్ని ఆచారం వంటి కార్యక్రమాలున్నాయి.

గత రెండున్నరేళ్లలో విడాకుల కేసులు గెలిచిన 18 మంది భర్తలు సానుకూల మనస్తత్వంతో మరింత ఆత్మగౌరవంతో బతికేలా ఈ వేడుకలో దిశానిర్దేశం చేయనున్నట్టు సంస్థ వెల్లడించింది. చట్టపరంగా, మానసికంగా, ఆర్దికంగా సుదీర్ఘకాలం పోరాడి గెలిచిన బాధితులకు సంతోషాన్ని ఇవ్వడానికి ఈ వేడుక నిర్వహించాలని అనుకున్నామని, అందులో భాగంగానే విడాకుల సెలబ్రేషన్స్ చేస్తున్నట్టు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు జకీ అహ్మద్ వివరించారు. అందుకు ఆహ్వాన పత్రికను కూడా రూపొందించడంతో ఆ పత్రిక వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు కూడా భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. అయితే ఎక్కువ మంది పాజిటివ్ కామెంట్స్ పెట్టడం చర్చనీయాంశం. కాగా, జాతీయ నేర గణాంక శాఖ నివేదిక ప్రకారం.. మన దేశంలో ఏడాదికి కోటి పెళ్లిళ్లు జరుగుతుండగా, వీటిలో 90 శాతం అరేంజ్డ్ మ్యారేజెస్. వీటిలో 80 శాతం హిందూ వివాహాలు అయితే పెళ్లి పెటాకులు చేస్తూ విడిపోతున్న జంటలు 13.6 లక్షలు. ముఖ్యంగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. విడాకుల కేసులు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. మన దేశంలో విడాకులకు ఆరు నెలల నుంచి 20 ఏళ్ళ సమయం పడుతుండగా, అమెరికాలో రెండేళ్లు, ఐరోపాలో ఆరేళ్ల సమయం పడుతుందని అంచనా. మన వద్ద వెయ్యికి 30 వరకు జంటలు విడాకుల వరకు వెళ్తుండగా, అమెరికాలో ఆ సంఖ్య 400 వరకు ఉంది.