ఏపీ సీఎం వైఎస్ జగన్ సభలో అపశృతి చోటు చేసుకుంది. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన వైఎస్సార్ పింఛను కానుక బహిరంగ సభలో 70 ఏళ్ల వృద్ధురాలు గాయపడింది. సభలో పాల్గొనడానికి బస్సులో వచ్చిన అర్జి పార్వతి అనే వృద్ధురాలు బస్సు దిగుతుండగా కాలు జారి పడిపోయింది. ఆమె కాళ్లపై నుంచి బస్సు టైర్లు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను కాకినాడలోని జెజేహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, ఇటీవల టీడీపీ నిర్వహించిన కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాటలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో సభలు, ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది.
అయితే మంగళవారం సీఎం సభలోనే అపశృతి చోటుచేసుకోవడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకుముందు చంద్రబాబు శని గ్రహమని అందుకే ఆయన సభలో అపశృతులు చోటు చేసుకున్నాయని వైసీపీ వర్గీయులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే జగన్ సభల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు కూడా జరిగాయని టీడీపీ వర్గం చెప్తోంది. 2019 మార్చిలో జగన్ సభలో పిట్టగోడ కూలి ఒకరు చనిపోవడాన్ని 20 మంది గాయపడడాన్ని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి వరుస ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని, అధికారులు, రాజకీయ నాయకులు మరింత జాగరూకతతో ఉండాలని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు.