70 ఏళ్ల వయసున్న ఓ మామ.. తన కొడుకు మరణంతో కోడలిని వివాహం చేసుకున్నాడు. స్థానిక ఆలయంలో పూలదండ వేసి పెళ్లి చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఈ విచిత్ర ఘటన గురించి తెలిసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకెళితే.. ఛపియా ఉమ్రావ్ గ్రామానికి చెందని కైలాష్ యాదవ్ అనే వ్యక్తికి నలుగురు కుమారులు సంతానం. భార్య 12 ఏళ్ల క్రితమే చనిపోగా పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని విడిగా కాపురం చేసుకుంటున్నారు. కైలాష్ ఒంటరిగానే జీవిస్తున్నాడు. అయితే మూడో కుమారుడు ఇటీవల చనిపోవడంతో కోడలు పూజ ఒంటరిదైంది.
దీంతో రెండు ఒంటరితనాలను ఒక్కటి చేయాలని తలచిన కైలాష్.. పూజను సమీపంలోని ఓ గుడికి తీసుకెళ్లి నుదుటిన సింధూరం దిద్ది పూల దండ వేశాడు. పూజ కూడా మామ గారికి పూల దండ వేసి తన సమ్మతిని తెలిపింది. అయితే ఈ పెళ్లి ఫోటో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కోడలిపై అంత ప్రేమ ఉంటే ఆమె వయసుకు తగ్గట్టు ఇంకో వరుడిని చూసి పెళ్లి చేయాలి కానీ వృద్ధుడు ఎలా చేసుకుంటారని ఒకరు, వారిద్దరూ మేజర్లు నిర్ణయం తీసుకునే హక్కు వారికి రాజ్యాంగం ప్రకారం ఉందంటూ మరొకరు కామెంట్లు చేస్తున్నారు. కోడలిని చేసుకున్న మామను స్థానికులు ప్రశ్నించగా, మౌనాన్ని ఆశ్రయిస్తున్నాడు కైలాష్ యాదవ్.