An unknown doner gives 11 crore to the kerala boy for treatment
mictv telugu

బాలుడికి 11 కోట్లు ఇచ్చిన అజ్ఞాత వ్యక్తి.. న్యూస్ వైరల్

February 22, 2023

పది రూపాయలు ఇవ్వాలంటే ఆలోచించే ఈ రోజుల్లో ఓ వ్యక్తి బాలుడి కోసం ఏకంగా రూ. 11 కోట్ల 60 లక్షల రూపాయలను దానం చేసేశాడు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి తన వంతు ప్రాణం పోసి సంజీవని అనిపించుకున్నాడు. ఇంత డబ్బు ఇచ్చినా అతనెవరో తెలియకపోవడం గమనార్హం. ఏదో మొక్కుబడిగా కొంత సాయం చేసి విపరీత ప్రచారం చేసుకునే మనుషులున్న కాలంలో అజ్ఞాత వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకెళితే.. కేరళలోని పాలక్కడ్‌కి చెందిన సారంగ్ మీనన్ – అదితి నాయర్ దంపతుల 15 నెలల కుమారుడు నిర్వాన్‌కి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే వ్యాధి సోకింది.

దీనికి చికిత్స చేయాలంటే విదేశాల నుంచి ఖరీదైన ఇంజెక్షన్లు తేవాల్సి ఉంటుంది. మొత్తంగా రూ. 17.50 కోట్లు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో దంపతులకు ఏం తోచలేదు. చివరికి పరిస్థితిని వివరిస్తూ ఫేస్‌బుక్‌లో ప్రకటన వేశారు. క్రౌడ్ ఫండింగ్ సేకరించి బాలుడికి చికిత్స ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన మాలీవుడ్ నటి అహనా కృష్ణ కూడా బహిరంగంగా నిధులను కోరింది.

17 లక్షల మంది తలా ఒక వంద రూపాయిలు ఇస్తే 17 కోట్లవుతుందని వీడియో ద్వారా అభ్యర్ధించారు. దీంతో ఫిబ్రవరి 19 వరకు రూ. 5.42 కోట్లు వసూలయ్యాయి. అయితే మరుసటి రోజు ఓ అనామక దాత రూ. 11 కోట్ల 60 లక్షలు దానం చేయడంతో ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. అతని పేరేంటో కూడా తమకు తెలియదంటున్నారు. ఇక చికిత్సకు కేవలం రూ. 80 లక్షలు మాత్రమే కావాలని చెప్తున్న దంపతులు.. విదేశాల నుంచి తెప్పించే ఇంజెక్షన్లపై జీఎస్టీని మినహాయించాలని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని రిక్వెస్ట్ చేస్తున్నారు.