ఎమ్మెల్సీల గెలుపు.. దుబ్బాక గుణపాఠమే! - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్సీల గెలుపు.. దుబ్బాక గుణపాఠమే!

March 20, 2021

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని పెద్దలు అన్నారు. మరీ అంత ఆలస్యం కాకుండా టీఆర్ఎస్ వెంటనే వెతుక్కుంది. రెండు ఎమ్మెల్సీ సీట్లను కైవసం చేసుకుని రెట్టించిన శక్తితో తిరిగి ట్రాక్‌లో పడింది. దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తడబడిన గులాబీ దళం పట్టభద్రుల నిజయోకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడి విజయం సాధించింది. ముఖ్యంగా దుబ్బాక ఫలితంతో అప్రమత్తమై విపక్షాలకు ‘ఒక్క సీటు’ చాన్స్ కూడా ఇవ్వకుండా పక్కా వ్యూహాన్ని అనుసరించి అనుకున్నది సాధించింది.

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలతో బీజేపీ తన హవా పెరిగిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని భావించింది. అయితే టీఆర్ఎస్ అలాంటిదేమీ లేదని, జనం ఇంకా తమవైపే ఉన్నారని తాజా ఎన్నికలతో మరోసారి నిరూపించింది. టీఆర్ఎస్‌కు కీలకంగా మారిన ఈ ఎన్నికలు తెలంగాణ ఉద్యమ నాయకత్వానికి ఇంకా ప్రజల్లో ఆదరణ ఉందని కూడా నిరూపించాయి. పొద్దున లేచినప్పటి నుంచి ప్రభుత్వాన్ని విమర్శించే తీన్మార్ మల్లన్న అనూహ్యంగా బలం పుంజుకుని టీఆర్ఎస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. తొలి, ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో సంక్లిష్టమైన ఎన్నికల్లో ఓటర్లు కూడా గందగరోళానికి గురై పొరపాటుగా ఓట్లేయడంతో చెల్లకుండా పోయిన 20వేలకు పైగా ఓట్లు అభ్యర్థులను తలరాతను శాసించే ఉంటాయి.
పీవీ సెంటిమెంట్, సోషల్ మీడియా..

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సరభి వాణిదేవీ గెలిచారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె అయిన ఆమెను ఎలాగైనా గెలిపించుకోవాలని టీఆర్ఎస్ కసరత్తు చేసింది. మంత్రి హరీశ్ రావు స్వయంగా రంగంలోకి దిగారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో జిల్లాల్లో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. 20 రోజులకుపైగా తన సిద్దిపేటకు కూడా వెళ్లకుండా హైదరాబాద్‌లోనే ఉండి కష్టపడ్డారు. దుబ్బాక ఎన్నికల సమయంలో సోషల్ మీడియాను సరిగ్గా వాడుకోని పార్టీ ఈసారి అప్రమత్తమై బీజేపీకి దీటుగా ప్రచారం చేసింది. కేసీఆర్‌పై విమర్శలను తిప్పికొడుతూ ‘తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేను వంద అంటా…’ అన్న చందంతో కౌంటర్లతో విరుచుకుపడింది. దీంతోపాటు పీవీ తెలంగాణ ఆణిముత్యమన్న సెంటిమెంటును టీఆర్ఎస్ భారీ స్థాయిలో ప్రచారంలోకి తీసుకెళ్లింది. కాంగ్రెస్ విస్మరించిన దివంగత ప్రధానిపై గౌరవంతో ఆయన కూతురును గెలింపించాలన్న భావన పట్టభద్రుల్లోకి వెళ్లింది. మరోపక్క బీజేపీ కూడా మతపరమైన అంశాలతో ప్రచారంలోకి దిగింది. బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావు వాణీదేవికి గట్టి పోటీ ఇచ్చారు. అయితే కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత, బీఫ్, రామాలయం వంటి అంశాలపై పార్టీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఉద్రిక్తతలు ఆ పార్టీకి బూమరాంగ్‌గా మారాయి. హోరాహోరీ పోరులో విజయం టీఆర్ఎస్‌నే వరించింది.

ఎన్ని విమర్శలు ఉన్నా..

ఆసక్తికరంగా సాగిన వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడానికి టీఆర్ఎస్‌కు స్వశక్తితోపాటు, ప్రతిపక్షాల బలహీనతలు, అనైక్యత బాగా కలిసి వచ్చాయి.. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న నుంచి గట్టి పోటీ ఎదురైనా.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సీన్‌లో లేకపోవడం విశేషం. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మూడో స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థి రాములు నాయక్ నాలుగో స్థానంలో నిలిచారు. పల్లా పలుకుడి, విస్తృత ప్రచారం, నిరుద్యోగ భృతిని అందిస్తామన్న కేసీఆర్ హామీ, టీఆర్ఎస్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు టీఆర్ఎస్‌కు ప్రత్యర్థి మల్లన్నకంటే పాతిక వేల ఓట్ల ఆధిక్యం సాధించిపెట్టాయి. అదే సమయంలో ఓటర్లు ఇంకా ఉద్యమ నేతలను ఆదరిస్తూనే ఉన్నారని, ప్రభుత్వ పనితీరును నిశితంగా గమనిస్తున్నారని మల్లన్నకు అనూహ్యంగా వచ్చిన లక్ష ఓట్లు గుర్తు చేస్తున్నాయి. మల్లన్న, కోదండరాం రెండు, మూడో స్థానాల్లో నిలవడం.. కాంగ్రెస్, బీజేపేలు పక్కకు తప్పుకోవడం ఓటర్ల చైతన్యానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంటుతో టీఆర్ఎస్, మత సెంటిమెంట్లతో బీజేపీ, ఘాటు లెక్కల విమర్శలతో మల్లన్న ఫోకస్‌లోకి రావడం, కాంగ్రెస్ దయనీయంగా కనుమరుగు కావడం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఏంటో కళ్లకు కడుతోంది. గుజరాత్‌లో బీజేపీ వల్లభభాయ్ పటేల్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం నిర్మించి ఆయనను కాంగ్రెస్ ఖాతా నుంచి తప్పించిన వైనం తెలంగాణలోనూ పునరావృతం కావడం ఈ ఎన్నికల్లో మరో విశేషం. కాంగ్రెస్ నేత పీవీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్ సర్కారు ఆయనను కాంగ్రెస్ ఖాతా నుంచి తప్పించి కూతురిని గులాబీ జెండాతో శాసననమండలికి పంపడం రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్న నానుడికి అద్దం పడుతోంది.

ఎప్పుడెలా ఉండాలో..

ఉద్యమ పార్టీగా పేరొందిన టీఆర్ఎస్ ప్రజల అభిమతాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, గౌరవిస్తూ ముందుకు సాగుతోందని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. తప్పులకు, పొరపాట్లకు ఏ పార్టీ అతీతం కాదు. వాటిని వెంటనే దిద్దుకుని ప్రజాసంక్షేమమే తమ లక్ష్యమని నిరూపించుకునే పార్టీలను ప్రజలు ఆదరించడం సహజం. కేవలం సెంటిమెంట్లు మాత్రమే అధికారాన్ని కట్టబెట్టలేవు, నిలబెట్టలేవు. వాటిని ప్రజాహితానికి అనుకూలంగా మలిచి నిత్యం జాగరూకతతో పనిచేస్తూ, మాటలకు పరిమితం కాకుండా చేతల్లో నిరూపించుకుంటే ప్రజలు ఆదర్శిస్తారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం.. ఏ పార్టీకైనా వర్తించే సూత్రం ఇది.