పాకిస్తాన్‌లో ఏం జరుగుతోంది.. క్షణక్షణం ఉత్కంఠ - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్‌లో ఏం జరుగుతోంది.. క్షణక్షణం ఉత్కంఠ

April 9, 2022

fbfbfdb

మన పొరుగు దేశం పాకిస్తాన్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మనమంతా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించే పట్టించుకుంటున్నాం కానీ, పాకిస్తాన్‌లో నెలకొన్న రాజకీయ, ఆర్ధిక సంక్షోభాల గురించి మనలో చాలా తక్కువ మంది తెలుసుకుంటున్నారు. ఉక్రెయిన్ దుస్థితికి రష్యా కారణమైతే.. పాకిస్థాన్ పతనానికి స్వయంకృతాపరాధమే కారణం అయింది.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టినప్పుడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రష్యా వెళ్లి పుతిన్‌ను కలవడం, అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సరైన సమయంలో వచ్చానని రష్యాకు మద్ధతుగా మాట్లాడడం తెలిసిందే. ఈ కారణంగానే పాక్ పతనం మొదలైందని మనలో చాలా మంది భావన. కానీ, గతేడాది నుంచే పాకిస్తాన్ సమస్యల సుడిగుండంలో ఇరుక్కోవడం మొదలైంది. ఉగ్రవాదులకు మద్ధతునిస్తోందన్న కారణంతో ఎఫ్ఏటీఎఫ్ పాక్‌ను గ్రేలిస్టులో పెట్టింది. బ్లాక్ లిస్టులోకి వెళ్లేదే కానీ, ఆ దేశానికి టర్కీ, మలేషియా, చైనాలు మద్ధతుగా నిలబడడంతో తప్పించుకోగలిగింది. గ్రేలిస్టులో ఉండడం వలన పలు సంస్థలు ఆర్ధిక సహాయం చేయలేవు. మరోవైపు ఆ దేశానికి ఒక దిక్కుగా ఇన్నాళ్లూ నిలబడ్డ సౌదీ అరేబియాతో వైరం పెట్టుకోవడంతో ఆ దేశం ఇచ్చిన అప్పులను బలవంతంగా తిరిగి తీసుకుంది. ఇదే సమయంలో చైనా కూడా తన అప్పులను అడగడంతో గతి లేక రుణాల్లో కొంత భాగం రీషెడ్యూల్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో విదేశీ మారకపు నిల్వలు అడుగంటిపోవడంతో సౌదీ అరేబియా వద్ద అవమానకర రీతిలో తల తాకట్టు పెట్టి కొంత సొమ్మును అప్పుగా పొందింది. మరోవైపు ప్రపంచ బ్యాంకు వద్ద ఫండ్ కోసం అభ్యర్థించగా, వారు పెట్టిన షరతులతో దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇటు ఆర్ధికంగా సతమతమవుతుంటే ఇమ్రాన్ మాస్కో పర్యటన ద్వారా అమెరికా, యూరప్ దేశాల ఆగ్రహానికి గురయ్యారు. పరిస్థితిని గమనించిన ఆ దేశ ఐఎస్ఐ, ఆర్మీ రెండూ కూడా ఇమ్రాన్‌కు మద్దతివ్వడం మానేశాయి.

ఇదే అదనుగా ప్రతిపక్షాలు తమ బలం పెంచుకున్నాయి. అంతేకాక, ఇమ్రాన్ పీటీఐ పార్టీలోని 23 మంది జాతీయ అసెంబ్లీ సభ్యులను తమ వైపుకు తిప్పుకున్నాయి. దీంతో ఇమ్రాన్ చైనా వైపు ఆశగా చూశాడు. అక్కడినుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో హతాశుడయ్యాడు. చివరికి విపక్షాలు అవిశ్వాస తీర్మానానికి నోటీసులివ్వడంతో ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనతో ప్రజల్లోసానుభూతి కోసం తనను పదవి నుంచి దించాలని అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశాడు. అంతేకాక, భారత్ మీద అపారమైన ప్రేమను చూపించాడు. మనదేశ విదేశాంగ నీతిని సమర్ధిస్తూ బహిరంగ సభల్లో అనేకమార్లు వ్యాఖ్యానించారు. దీంతో ప్రతిపక్ష నేత షహబాజ్ షరీఫ్ ఇమ్రాన్‌ను భారత్‌పై ప్రేమ ఉంటే ఆదేశానికే వెళ్లిపొమ్మని విమర్శించారు. ఈ క్రమంలో ఇమ్రాన్‌కు సుప్రీంకోర్టు రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో నేడు జాతీయ అసెంబ్లీ సమావేశమైంది. సభకు విపక్షాల తరపున 173 మంది హాజరుకాగా, అధికార పీటీఐ తరపున కేవలం 26 మందే హాజరయ్యారు. ఎలాగూ ఓడిపోతానన్న భయంతో ఇమ్రాన్ కూడా సభకు రాలేదు. ఈరోజు ఇదే అంశంపై సభలో రభస కొనసాగుతోంది. ఈ రోజు రాత్రికి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది.

కొసమెరుపు : ఎఫ్ఏటీఎఫ్ విధించిన 26 నిబంధనల్లో పాకిస్తాన్ 25 నిబంధనలను సంతృప్తికరంగా పూర్తి చేసింది. కానీ, 26వ నిబంధన అయిన ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదుల మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. అంత సాహసం కూడా పాకిస్తాన్ సమీప భవిష్యత్తులో చేసే అవకాశం కనిపించడం లేదు. అది జరగనంతవరకూ గ్రేలిస్టు నుంచి పాకిస్తాన్ తొలగిపోదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ప్రభుత్వం దిగిపోయి కొత్త ప్రభుత్వం వచ్చినా.. ఆర్ధిక సమస్యలు అలాగే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.