శ్రీలంకలో సంక్షోభం.. అప్పులే కొంపముంచాయా? - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీలంకలో సంక్షోభం.. అప్పులే కొంపముంచాయా?

April 9, 2022

flggg

లంక ద్వీపంలోని పరిస్థితుల గురించి మనం రోజుకో వార్త వింటున్నాం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే అసలు సమస్య అర్థం కాదు. మూలాల్లోకి వెళితే ఇప్పటి దుస్థితికి కారణం తెలుస్తుంది. వాటిని స్థూలంగా పరిశీలిద్దాం. ప్రధానంగా చూస్తే మనకు మూడు కారణాలు కనిపిస్తాయి. అవి భారత్, చైనా, కరోనా. శ్రీలంకలో నివాసముండే తమిళుల వల్ల భారతదేశం పేరు పెట్టాల్సి వచ్చింది. ఎల్‌టీటీఈ ఉగ్రవాదం, భారత్ శాంతి సైన్యాలను లంకకు పంపడం వంటివి మనకు తెలిసిందే. ఈ క్రమంలో ప్రత్యేక దేశం అడుగుతున్న ఎల్‌టీటీఈని నిర్మూలించడానికి శ్రీలంక భారత్ సహాయం కోరింది. కానీ, ద్రవిడ పార్టీల ఒత్తిడి వల్ల అప్పటి సంకీర్ణ ప్రభుత్వాలు ఆ సాహసం చేయలేకపోయాయి. దాంతో లంక చైనా సహాయం కోరింది. అప్పటికే భారతదేశంపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చైనాకు శ్రీలంక ఆఫర్ అనుకోని వరంలా మారింది. వెంటనే ఆధునిక ఆయుధాలు ఇచ్చి సింహళీయుల అభిమానాన్ని చూరగొంది.

ఇదే అదనుగా తన లక్ష్య సాధన కోసం ఆ దేశాన్ని రుణ ఊబిలోకి లాగింది. మౌలిక సదుపాయాల పేరిట శక్తికి మించిన అప్పులు ఇస్తూ వచ్చింది. వాటిని లంక తిరిగి చెల్లించే స్థితిలో ఉండదని చైనాకు తెలుసు. అప్పు తీర్చకపోవడంతో ఆ దేశంలో ఉన్న హంబన్ టోటా పోర్టును చైనా 99 ఏళ్ల లీజుకు తీసుకుంది. అక్కడో నౌకాశ్రయం ఏర్పాటు చేసుకొని భారతదేశంపై నిఘా వేయడం మొదలు పెట్టింది. దీనిపై భారత్ అభ్యంతర పెట్టినా లంక పాలకులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో కరోనా రావడంతో లంకకు పెద్ద దెబ్బ తగిలింది. పర్యాటకం ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించే లంకకు కరోనా వల్ల పర్యాటకులు తగ్గిపోవడంతో రాబడి తగ్గిపోయింది. ఉన్న కొన్ని నిధులు అప్పుల కిస్తీలు చెల్లించడానికి మళ్లించారు.

ఈ నేపథ్యంలో రసాయన వ్యవసాయంలో వాడే ఎరువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి డాలర్లను సేవ్ చేయాలనే ఉద్దేశంతో రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు బలవంతంగా మళ్లించారు. దీంతో పంటల దిగుబడి భారీగా తగ్గిపోయి ఆహార కొరత ఏర్పడింది. ఇదిలా ఉండగా, డాలర్లు రోజురోజుకూ కరిగిపోతుండడంతో చమురు వంటి వాటికి చెల్లింపులు చేయడానికి నిధుల కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో చైనా వైపునుంచి ఏమాత్రం సహకారం అందలేదు. చివరికి భారతదేశమే వారికి పెద్ద దిక్కుగా మారింది. ఆహార ధాన్యాలతో పాటు 500 మిలియన్ డాలర్ల క్రెడిట్, ఒక బిలియన్ డాలర్ అప్పుగా ఇవ్వడానికి భారత్ ఒప్పుకుంది. ఈ సహాయానికి బదులుగా చైనాకు చెక్ పెట్టడానికి శ్రీలంకతో కొన్ని కీలక రక్షణ ఒప్పందాలను భారత్ కుదుర్చుకుంది. అయితే సమస్య ఇక్కడితో అయిపోలేదు. రాబోయే రోజుల్లో శ్రీలంక 7 బిలియన్ డాలర్ల అప్పును తీర్చాలి. అందుకు నిధుల కోసం లంక ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో పాటు మరికొన్ని సంస్థలతో చర్చించడానికి ప్రయత్నిస్తూ ఉంది.

కొసమెరుపు : శ్రీలంక పరిస్థితికి కరోనా, తద్వారా ఏర్పడిన పరిణామాలు కారణం అని కొందరు భావిస్తున్నారు. కానీ, కేవలం పర్యాటకం మీదే ఆధారపడిన దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటికి రాని సమస్య లంకకే ఎందుకొచ్చింది? కాబట్టి ఇది సహేతుకమైన కారణం కాదు. అసలు కారణం చైనా వద్ద ఆ దేశ ప్రభుత్వాలు విచ్చలవిడిగా చేసిన అప్పు. వాటిని వసూలు చేయడంలో చైనా అవలంబించిన నిర్దాక్షిణ్య వైఖరి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో గతంలో భారత్‌కు దూరమైన శ్రీలంక పాలకులు.. నేడు మీరే మమ్మల్ని ఆదుకోగలరంటూ మన దేశాన్ని అభ్యర్ధిస్తున్నారు.